Share News

లోకేశ్ మనసును కదిలించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ ట్వీట్

ABN , Publish Date - Apr 18 , 2026 | 10:00 AM

విజయవాడ బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారిగా జీవనం సాగిస్తున్న దుర్గారావు సమస్యను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ట్వీట్ చేయడంతో మంత్రి నారా లోకేశ్ దృష్టికి చేరింది. ఆ ట్వీట్‌ ఆయన మనసును కదిలించింది.

లోకేశ్ మనసును కదిలించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ ట్వీట్
Minister Nara Lokesh

అమరావతి, ఏప్రిల్ 17: రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయి, విజయవాడ బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారిగా జీవనం సాగిస్తున్న దుర్గారావు సమస్యను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ట్వీట్ చేయడం మంత్రి నారా లోకేశ్ దృష్టికి చేరింది. ఆ ట్వీట్‌ ఆయన మనసును కదిలించింది. వెంటనే మంత్రి స్పందిస్తూ.. బాధితుడు దుర్గారావుకు ప్రభుత్వ ఇంటి స్థలం అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మంత్రి లోకేశ్‌కు ఏబీఎన్‌ డైరెక్టర్ భానుప్రకాశ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇదీ విషయం..

దుర్గారావు అనే వ్యక్తి.. రోడ్డు ప్రమాదంలో‌ కాలు కోల్పోయి విజయవాడ బీసెంట్ రోడ్‌లో చిరు వ్యాపారిగా పనిచేస్తున్నారు. గత ఏడాది దీపావళి పండుగ రోజు బీసెంట్ రోడ్‌లో పాదయాత్రగా వెళ్లిన సీఎం చంద్రబాబు.. దుర్గారావు దీనస్థితి తెలుసుకుని ఇల్లు, పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలలు అయినా ఎవరూ పట్టించుకోలేదని కలెక్టర్ కార్యాలయం వద్ద దుర్గారావు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను ఏబీఎన్‌ డైరెక్టర్ భానుప్రకాశ్.. తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేయడంతో పాటు దుర్గారావు పరిస్థితిని ప్రపంచానికి తెలియజేశారు. ఈ ట్వీట్‌ను చూసిన వెంటనే మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఏబీఎన్ డైరెక్టర్ ద్వారా దుర్గారావు వివరాలు సేకరించిన లోకేశ్ టీం... గురువారం(ఏప్రిల్ 16) రాత్రి దుర్గారావు నివాసానికి వెళ్లి... ప్రభుత్వ ఇంటి స్థలం తాలుకు దస్త్రాలను అందజేశారు. పెన్షన్ కూడా త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అకస్మాత్తుగా అధికారుల స్పందన చూసి దుర్గారావు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.


లోకేశ్, భానుప్రకాశ్‌కు నా కృతజ్ఞతలు: దుర్గారావు

20 సంవత్సరాల నుంచి బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారిగా జీవనం సాగిస్తున్నానని దుర్గారావు తెలిపారు. ‘నాకు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం కారణంగా కాలు తీసేశారు. సీఎం చంద్రబాబు దీపావళి రోజు బీసెంట్ రోడ్డుకు వచ్చినప్పుడు కలిశాను. ఇల్లు, పెన్షన్ కావాలని కోరగా.. ఇప్పిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆరు నెలల నుంచి ఎవరూ రాకపోవడంతో నేను కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి ఆవేదన చెబుతూ ఓ వీడియో పెట్టాను. నా పరిస్థితి తెలుసుకున్న ఏబీఎన్ డైరెక్టర్ భానుప్రకాశ్.. వారి ఎక్స్‌ ఖాతాలో నా విషయం మొత్తం పోస్ట్ చేయడంతో మంత్రి లోకేశ్​కు నా కష్టం గురించి తెలిసింది. వెంటనే స్పందించిన మంత్రి.. అధికారులను మా ఇంటికి పంపించి ఇల్లు మంజూరు చేయించారు. త్వరలో పెన్షన్ కూడా ఇప్పిస్తామని చెప్పారు. నాకు సహాయం చేసినందుకు ఏబీఎన్ డైరెక్టర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ.. వారికి నేను, నా కుటుంబం ఎంతో రుణపడి ఉంటాం. దివ్యాంగుడను, ఇంత పేదరికంలో ఉన్న నన్ను ఆదుకుని జీవనం సాగించే ధైర్యాన్నిచ్చిన మంత్రి లోకేశ్‌, ఏబీఎన్ డైరెక్టర్ భానుప్రకాశ్‌​లకు నమస్కారాలు. నాకు వారి అండదండలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ దుర్గారావు భావోద్వేగానికి లోనయ్యారు.


ఇవి కూడా చదవండి...

ఐపీఎల్‌ మ్యాచ్‌..ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

తూర్పుగోదావరికి సీఎం చంద్రబాబు.. నేటి షెడ్యూల్ ఇదే..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 10:32 AM