Share News

రక్తం తాగుతున్నాయి..

ABN , Publish Date - Aug 22 , 2026 | 10:21 AM

హైదరాబాద్ నగరం ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి.

రక్తం తాగుతున్నాయి..

  • పగలు, రాత్రి తేడా లేకుండా కుడుతున్న దోమలు

  • పట్టించుకోని జీహెచ్‌ఎంసీ, ప్రజాప్రతినిధులు

  • కానరాని ఎంటమాలజీ సిబ్బంది

హైదరాబాద్: హైదరాబాద్ నగరం ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. పగలు, రాత్రి సమయాల్లో ప్రజలను కుడుతుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.


కనిపించని ఎంటమాలజీ సిబ్బంది

ఎంటమాలజీ విభాగం సిబ్బంది మామూలు రోజుల్లో వారానికోమారు వీధుల్లో తిరుగుతూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, చెరువుల వద్ద, చెత్త ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్‌ చేస్తూ దోమల మందును పిచికారి చేస్తుంటారు. ఇంటింటికీ వచ్చినట్లు ఇళ్ల వద్ద మార్కింగ్‌ చేస్తుంటారు. ప్రస్తుతం దోమలు విజృంభిస్తున్నా వారు కనిపించకుండా పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌కాలనీ, బీజేఆర్‌నగర్‌, మహాభారత్‌నగర్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ సముదాయం, న్యూ సీఐబీ క్వార్టర్స్‌,


శ్రీనివాసనగర్‌, బుడగజంగం బస్తీ, మార్కెట్‌, ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌, లక్ష్మీనగర్‌తోపాటు ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, తదితర ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. ఎంటమాలజీ విభాగం అధికారులు, సిబ్బంది కనీస మాత్రంగానైనా స్పందించడంలేదు. వార్డుల వారీగా విభజించిన సిబ్బందిని కేవలం వీఐపీ ప్రాంతాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చేస్తూ మిగతా చోట్ల పనులు నిలిపివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు దోమల నివారణకు పిచికారి చేయాల్సిన మందులను, ఫాగింగ్‌ మందులను ప్రైవేట్‌ సంస్థలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


city5.2.jpgపత్తాలేని ఫాగింగ్‌

దోమల నివారణకు కనీసం వారానికోమారు నిర్వహించాల్సిన ఫాగింగ్‌(దోమల పొగ)ను అవసరమున్న సమయంలో చేయడం లేదు. దీంతో హుస్సేన్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల్లోని మురికివాడల బస్తీల్లో దోమలు విజృంభిస్తున్నాయి. ఐమాక్స్‌ ఎదురుగా ఉన్న లేక్‌వ్యూ పార్కు, బంజారాహిల్స్‌లోని బంజారా లేక్‌లలో డ్రోన్ల ద్వారా దోమల మందును పిచికారి చేస్తామని చెప్పినా అమలు చేయడం లేదు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి దోమల నివారణకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉన్నది.


నిద్ర ఉండడం లేదు

పగలూ రాత్రి తేడా లేకుండా దోమలు ఇంట్లా, బయటా ఎక్కడున్నా కుడుతూ రక్తం తాగుతున్నాయి. ఇక రాత్రి సమయాల్లో చెవుల దగ్గర గుయ్‌.. గుయ్‌ అంటూ నిద్ర పోకుండా చేస్తున్నాయి. ఇంతగనం దోమలు ఎప్పుడూ చూడలేదు. దోమల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలి.

  • టి.విజయ్‌, బ్యాంక్‌ ఉద్యోగి


ఫాగింగ్‌ ఏది? దోమల మందేది?

దోమల బెడదను తట్టుకోలేకపోతున్నాం. దోమల కోసం మస్క్విటోమ్యాట్స్‌, ఆలౌట్‌, జెట్‌ లాంటి కాయల్స్‌ను వాడుతున్నా ప్రయోజనం లేదు. ఎంటమాలజీ విభాగం వారు అసలు కనిపించడం లేదు. అవసరమైనప్పుడు పనిచేయని సిబ్బంది ఎందుకు? ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి దోమలు లేకుండా చేయాలి.

  • నర్సింగ్‌రావు, న్యూ సీఐబీ క్వార్టర్స్‌


ఈ వార్తలు కూడా చదవండి:

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ అర్హుల జాబితా 25న..

దొంగ, పోలీస్‌.. చెట్టపట్టాల్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 10:21 AM