దొంగ, పోలీస్.. చెట్టపట్టాల్
ABN , Publish Date - Aug 22 , 2026 | 08:58 AM
దొంగలు, గంజాయి విక్రేతలు, దోపిడీ ముఠాలను పరిగెత్తించాల్సిన పోలీసులు.. వారితో జత కడుతున్నారు.
గంజాయి విక్రేతలకు ఇన్‌ఫార్మర్ బొల్లా బ్రదర్స్ సహకారం
సెల్ చోరీ ముఠాలతో దోస్తీ, విక్రయాల్లో వాటాలు
కానిస్టేబుల్ నేతృత్వంలో దోపిడీ బృందాలు
బూటకపు తనిఖీ పేరిట రూ.లక్షలతో ఉడాయింపు
దొంగలతో పోలీస్ దోస్తీకి తార్కాణాలు
డిపార్టుమెంట్‌లో తీవ్ర చర్చ
క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారుల సీరియస్
హైదరాబాద్ సిటీ: దొంగలు, గంజాయి విక్రేతలు, దోపిడీ ముఠాలను పరిగెత్తించాల్సిన పోలీసులు.. వారితో జత కడుతున్నారు. ఇదే అదనుగా భావించి ప్రబుద్ధులు చీకటి దందాలకు తెరలేపుతున్నారు. సెల్‌ఫోన్ చోరీ ముఠాలకు అరదందాలు వేయాల్సిన చేతులకు షేక్‌హ్యాండ్ ఇస్తున్నారు. విక్రయించిన సొత్తుతో వాటాలు తీసుకుంటున్నారు. ఏకంగా ముఠాలే ఏర్పాటు చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల రవాణాకు సహకరించడం ఇప్పుడు డిపార్టుమెంట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాలుగు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన బొల్ల బ్రదర్స్ గంజాయి దందాలో వారి పాత్రపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నారు. ఎస్సై సహా.. పలువురు కానిస్టేబుళ్లు ఈ ముఠాకు సహకరించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది.
ముందు నమ్మించి..
ఇటీవల గంజాయి దందాలో వెలుగులోకి వచ్చిన బొల్ల్లా బ్రదర్స్ .. దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్‌కుమార్‌లు బాలానగర్ ప్రాంతంలో ఉంటూ.. పోలీసులతో పరిచయాలు పెంచుకొని పోలీస్ ఇన్‌ఫార్మర్‌లుగా చెలామణి అయ్యారు. నేరాల ఛేదన, క్లూస్, ఇన్‌ఫర్మేషన్ తెలుసుకోవడంలో పోలీసులు వీరి సహకారం తీసుకునేవారు. మంచి పరిచయాలు ఏర్పడిన తర్వాత ఈజీ మనీకోసం గంజాయి దందాను బొల్ల బ్రదర్స్ ప్రారంభించారు. పోలీసులే వారితో దోస్తీ కట్టి పార్టీలు చేసుకుంటుండంతో ఎవరికీ ఎలాంటి అనుమానమూ రాలేదు. ఇటీవల గంజాయి సరఫరా చేస్తున్న ముఠాసభ్యులతో వీరికి సత్సంబంధాలున్నట్లు గుర్తించారు.
సెల్‌ఫోన్ చోరీ ముఠాతో దోస్తీ..
దొంగలతో పరిచయాలు పెరిగిన తర్వాత.. పోలీసులే దోస్తీ చేస్తున్నారు. వారికి ఇంకా అడ్డు అదుపూ ఉంటుందా?. నగరంలో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముఠాలకు ఇద్దరు పోలీసులు సహకరిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు కటకటాలపాలయ్యారు. ఇక రద్దీ ప్రాంతాలు, సిటీ బస్సులు, బస్టాండులు, రైల్వేస్టేషన్స్, హాస్టల్స్‌లో రెక్కీ చేసిన దొంగలు రోజుకు పదుల సంఖ్యలో సెల్‌ఫోన్‌లు చోరీ చేసేవారు. విక్రయించగా వచ్చిన సొత్తులో వాటాలు పంచుకునేవారు. పోలీసులకు చిక్కితే.. బెయిల్ తెప్పిస్తారు. ఓ కేసులో దొంగలను విచారిస్తున్న క్రమంలో పోలీసుల బాగోతం వెలుగులోకి వచ్చింది.
అంతర్గత విచారణ..
దొంగతనాలు, దోపిడీలకు, మాదక ద్రవ్యాల సరఫరాకు కొంతమంది పోలీసులు సహకరించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలో కమిషనరేట్ ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
ఏకంగా దొంగల ముఠాలే ఏర్పాటు
గతంలో ఓ కానిస్టేబుల్.. దొంగల ముఠాలు ఏర్పాటు చేసుకొని ఏపీ, తెలంగాణతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలోనూ దొంగతనాలు చేయించేవాడు. సొత్తును సమానంగా పంచుకునేవారు. నల్గొండ పోలీసులకు ఒక దొంగల ముఠా చిక్కగా విచారిస్తున్న క్రమంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పేరు వెలుగులోకి వచ్చింది. విషయం అప్పటి సీపీ సీవీ ఆనంద్ దృష్టికి రాగా కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
చెకింగ్ పేరుతో రూ. 8.50లక్షలు కొట్టేసిన కానిస్టేబుల్
2023లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు నమ్మించి, తన అనుచరులతో ఫేక్ వాహన చెకింగ్ నిర్వహించి వాహనదారుడి బెదిరించి రూ. 18.50లక్షలతో ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఉడాయించాడు. ఆ తర్వాత అతడిని సస్పెండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News