జర్నలిస్టులు శత్రువులు కారు
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:08 AM
ప్రశ్నించే గళాలకు సమాధానం చెప్పే ధైర్యంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇమిడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఆ గళాలను అణచివేయటం ప్రజాస్వామ్యం కాదని పేర్కొన్నారు.
వాళ్లు అడిగే అసౌకర్యమైన ప్రశ్నలు బెదిరింపులు కావు
వాటికి సమాధానం చెప్పే ధైర్యంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది
మహిళా పాత్రికేయుల జాతీయ సదస్సులో మంత్రి సీతక్క
విశ్వసనీయతే అత్యంత విలువైన మూలధనం: జస్టిస్ రాధారాణి
రిపోర్టింగ్‌లో మహిళల భాగస్వామ్యం పెరగాలి: మల్కాజిగిరి సీపీ సుమతి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రశ్నించే గళాలకు సమాధానం చెప్పే ధైర్యంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇమిడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఆ గళాలను అణచివేయటం ప్రజాస్వామ్యం కాదని పేర్కొన్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన పౌర నిరసనలను రిపోర్టు చేయటానికి వెళ్లిన మహిళా పాత్రికేయులపై అత్యంత అమానవీయమైన దాడులు, లైంగిక వేధింపులు జరిగాయన్న వార్తలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పారు. మైక్రోఫోన్ పట్టుకున్న జర్నలిస్టులు శత్రువులు కాదని, వాళ్లు అడిగే అసౌకర్యమైన ప్రశ్నలు బెదిరింపులు అంతకన్నా కావని అన్నారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో శనివారం బేగంపేటలోని ఒక హోటల్‌లో మహిళా పాత్రికేయుల జాతీయ సదస్సు ప్రారంభమైంది.
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల స్వేచ్ఛను కాలరాసే పితృస్వామ్య భావజాలాన్ని అధిగమించి, స్త్రీలను స్వతంత్ర వ్యక్తులుగా సమాజం గుర్తించాలని ఆకాంక్షించారు. ఒక మహిళ గౌరవానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే వృత్తిపరమైన భేదాలు, భిన్నాభిప్రాయాలు, భావజాలాలకు అతీతంగా బాధితుల పక్షాన మనమంతా నిలవాలని సూచించారు. సమాజంలో ఎవరికీ వినిపించని, ఎవరూ పట్టించుకోని సమూహాల గొంతుకలను ఎంత నిబద్ధతతో ప్రతిబింబిస్తున్నామన్నదే జర్నలిజానికి నిజమైన పరీక్ష అని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు జస్టిస్ రాధారాణి అన్నారు. డిజిటల్ మాధ్యమాలు మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి కొత్త అవకాశాలు కల్పించాయని తెలిపారు. డిజిటల్ యుగంలో విశ్వసనీయతే అత్యంత విలువైన మూలధనం అని పేర్కొన్నారు.
పితృస్వామ్య భావజాలం తాలూకు సవాళ్లను, లింగ వివక్షను ఎదుర్కొని జర్నలిజంలో రాణించడానికి మహిళలకు అవసరమైన నైపుణ్యాల గురించి ఈ సదస్సులో ప్రత్యేక చర్చ జరగాలని మల్కాజిగిరి పోలీసు కమిషనర్ బి.సుమతి సూచించారు. రిపోర్టింగ్‌లో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు. సాంకేతిక నైపుణ్యాల పెంపుపై ఇన్ఫోసి్‌సతో కలసి కర్ణాటక మీడియా అకాడమీ జర్నలిస్టులకు శిక్షణ ఇస్తోందని ఆ సంస్థ అధ్యక్షురాలు ఆయోషా ఖానుమ్ తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివా్‌సరెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ, ఐజేయూ అధ్యక్షుడు బల్వీందర్‌సింగ్ జమ్ము తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వారంలో అనుమతులివ్వకుంటే కాలేజీలు బంద్
కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను త్వరితగతిన రాబట్టండి: సీఎస్
న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యం
Read Latest AP News And Telangana News And International News And Telugu News