వారంలో అనుమతులివ్వకుంటే కాలేజీలు బంద్
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:56 AM
రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో ఇంటర్ బోర్డు ఘోరంగా విఫలమైందని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం విమర్శించింది.
కొందరు నకిలీ ఎన్వోసీలిస్తే అధికారులు నిద్రపోయారా?
లంచాలు వసూలు చేసేందుకే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
ఇంటర్ బోర్డుపై రాష్ట్ర ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు సతీష్ ఆరోపణ
హైదరాబాద్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో ఇంటర్ బోర్డు ఘోరంగా విఫలమైందని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం విమర్శించింది. ఫీజు చెల్లించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 128 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని సంఘం అధ్యక్షుడు గౌరీ సతీష్ పేర్కొన్నారు. లంచాలు వసూలు చేయడం, అందినకాడికి దండుకోవడమే లక్ష్యంగా ఇంటర్ బోర్డు అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గౌరీ సతీష్ మీడియాకు తెలిపారు. ప్రతి పనికి లంచం అడుగుతూ ఇంటర్ బోర్డు అధికారులు కాలేజీల యాజమాన్యాల రక్తం తాగుతున్నారన్నారు. 128 కాలేజీలకు ఇప్పటివరకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని, వాటిలో ప్రవేశాలు పొందిన వేలాది విద్యార్థుల భవితవ్యం ఏమిటని ప్రశ్నించారు. వారం రోజుల్లో అనుమతులు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీలు బంద్ చేసి నిరసన తెలుపుతామన్నారు. నకిలీ ఎన్వోసీలపై కాలేజీల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని, కొన్ని కాలేజీలు నకిలీలు సమర్పిస్తే వాటిని తనిఖీ చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అని ప్రశ్నించారు. ఎన్వోసీలు నకిలీవే అయితే జిల్లా ఇంటర్ విద్య అధికారుల నుంచి బోర్డు అధికారుల వరకు అందరూ గుడ్డిగా ఎలా ఆమోదించారన్నారు.
‘అసలో, నకిలీనో పరిశీలించకుండా నిద్రపోయారా? లంచాల రుచి మరిగిన అధికారులు విధులు నిర్వర్తించడం మానేశార’ని విమర్శించారు. కాలేజీల్లో చిన్నచిన్న లోటుపాట్లు చూపించి లంచాలు వసూలు చేసేందుకే బోర్డు కార్యదర్శి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇప్పటికే అధికారులు ప్రతి చిన్న పనికీ లంచాలు తీసుకుంటూ తమ రక్తం తాగుతున్నారని, మిగిలిన సగం రక్తాన్నీ తాగకుండా టాస్క్‌ఫోర్స్ రద్దు చేయాలన్నారు. ప్రతి ఏటా తమ కాలేజీలు అధికారికంగా రూ.45 కోట్లు చెల్లిస్తున్నాయని, వీటిని బోర్డు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బోర్డు ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం సలహాదారు వరదారెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
పనిచేయండి.. లేకుంటే తప్పుకోండి!
న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యం
Read Latest AP News And Telangana News And International News And Telugu News