Share News

Minister Seethakka: కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క.. ఎందుకంటే?

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:42 AM

మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి సీతక్క కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను మంత్రి కలిసి మేడారం జాతరకు ఆహ్వానించనున్నారు.

Minister Seethakka: కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క.. ఎందుకంటే?
Minister Seethakka

హైదరాబాద్, జనవరి 8: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (Former CM KCR) ఈరోజు (గురువారం) మంత్రి సీతక్క (Minister Seethakka) కలవనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత‌ను మంత్రి సీతక్క కలిసి.. మేడారం మహా జాతరకు (Medaram Maha Jatara) ఆహ్వానించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు మరో మంత్రి కొండా సురేఖ (Minister konda Surekha) కూడా పాల్గొననున్నారు. మేడారం మహా జాతరకు సంబంధించి అధికారిక ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు అందజేయనున్నట్లు సమాచారం.


మేడారం మహాజాతర నేపథ్యంలో విపక్ష నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులను మంత్రి సీతక్క స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించనున్నారు. మేడారం మహాజాతరను ప్రజలందరి పండుగగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహా జాతరకు రాజకీయాలకు అతీతంగా అందరికీ సర్కార్ ఆహ్వానాలు పలుకుతోంది.


జనవరి 28 నుంచి మహాజాతర..

కాగా.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతర జనవరి 28 నుంచి ప్రారంభంకానుంది. జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జాతర జరుగనుంది. జనవరి 28న సారలమ్మ గద్దెకు ఆగమనం, 29న సమక్క గద్దెకు ఆగమన కార్యక్రమాలు జరుగనున్నాయి. 30న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. 31న తిరిగి అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. మహా జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలిరానున్నారు. మేడారం మహా జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం..

మహా జాతరకు ముందు జనవరి 19న అమ్మవారి గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) పలువురు మంత్రులు హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి...

పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..

మూడేళ్ల తర్వాత కాదు.. ఇప్పుడే రా చూసుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 08 , 2026 | 12:23 PM