Rajahmundry: పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..
ABN , Publish Date - Jan 08 , 2026 | 09:50 AM
పూరి నుంచి తిరుపతి వెళ్తున్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపేశారు.
రాజమండ్రి, జనవరి 8: పూరి నుంచి తిరుపతి వెళ్లే 17479 నంబర్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో రైలు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. రైలులోని బీ5 బోగీలో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బోగీల నుంచి కిందకు దింపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు వచ్చిన బోగీని పరిశీలించింది. ఈ ఘటనతో కొంతసేపు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటా 40 నిమిషాల పాటు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో రైలును అధికారులు నిలిపివేశారు. విస్తృత తనిఖీల తర్వాత రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి రైలు బయలుదేరి వెళ్లింది.
ఇంజన్ నుంచి విడిపోయిన బోగీలు
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో రన్నింగ్ గూడ్స్ ఇంజన్ నుంచి బోగీలు విడిపోయిన ఘటన కలకలం రేపింది. మొలకలమూరు నుంచి జిందాల్‌కు వెళ్లే గూడ్స్ రైలు.. రన్నింగ్‌లో ఉండగా, 4వ వ్యాగన్ వద్ద లింక్ కట్ కావడంతో సుమారు 45 బోగీలు.. ఇంజిన్ నుంచి విడిపోయాయి. ఇంజిన్ దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇంజన్‌ను ఆపేశారు. రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సాంకేతిక లోపంపై విచారణ చేపట్టామని తెలిపారు. బోగీలను మళ్లీ అనుసంధానం చేసే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
భక్తులకు అలర్ట్.. ఆ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన..
వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్ రైళ్లు
Read Latest AP News And Telugu News