JC Prabhakar Reddy: మూడేళ్ల తర్వాత కాదు.. ఇప్పుడే రా చూసుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:15 AM
రాయలసీమకు పౌరుషం లేదని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడటం దురహంకారమని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ధర్మవరంలో కేతిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతపురం, జనవరి 8: రాయలసీమ పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేతిరెడ్డి వ్యాఖ్యలు రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. ‘నేను రాయలసీమ బిడ్డనే.. నాకు పౌరుషం ఉంది. కానీ కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు మూడేళ్ల తర్వాత చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, దమ్ముంటే ఇప్పుడే రావాలని సవాల్ విసిరారు. ‘మూడేళ్ల తర్వాత కాదు.. ఇప్పుడే చూసుకుందాం రండి’ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
రాయలసీమకు పౌరుషం లేదని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడటం దురహంకారమని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసీ హెచ్చరించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఉప్పు కారం తిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు ఎక్కడ? ఆయన కొడుకులు ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నించారు. ధర్మవరంలో కేతిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘గుడ్ మార్నింగ్’ అంటూ షో చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారని విమర్శించారు. ‘పౌరుషం లేని మీరు రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా?’ అంటూ మండిపడ్డారు. నీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ రాజకీయాలు చేస్తే రైతులే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కేతిరెడ్డి వద్ద ఉన్న కార్లు, గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంచివారు కాబట్టే ఇప్పటి వరకు ఓపికగా ఉన్నామని, అభివృద్ధి కోసం ఆయన తిరుగుతుంటే.. వైసీపీ నేతలు రప్పా రప్పా అంటూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇంకోసారి రాయలసీమ పేరు తీస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. దమ్ముంటే రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలని.. చంద్రబాబు ఏం చేశారో?.. జగన్ ఏం చేశారో? ప్రజల ముందు తేలుద్దాం అంటూ జేసీ ఛాలెంజ్ విసిరారు. చీము, రక్తం ఉంటే తాడిపత్రికి రావాలన్నారు. అవసరమైతే మళ్లీ జైలుకి వెళ్లడానికి కూడా సిద్ధమేనని జేసీ స్పష్టం చేశారు. కేతిరెడ్డి కుటుంబం రాయలసీమ ప్రజలను తక్కువ అంచనా వేస్తే తగిన ఫలితం తప్పదని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్ రైళ్లు
పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..
Read Latest AP News And Telugu News