తెలంగాణలో భూసమగ్ర సర్వేపై మంత్రి పొంగులేటి సమీక్ష.. పలు కీలక ఆదేశాలు జారీ
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:29 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వేపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూసర్వేపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు భూ రీసర్వేలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సర్వేకు ముందు భూ యజమానులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, గ్రామకంఠాల హద్దులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
‘రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర సర్వేను చేపట్టింది. మూడు దశల్లో ఈ భూసర్వే కొనసాగుతుంది. వచ్చే నెలాఖరులోగా తొలిదశ సర్వే పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. తొలి దశలో భాగంగా ఇప్పటికే 2,720 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి అయింది. సర్వేలో భాగంగా ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయిస్తున్నాం. అనంతరం ప్రతి సర్వేనెంబర్కు ప్రత్యేక భూదార్ ఐడీని కేటాయిస్తున్నాం. ఆధునిక సాంకేతికతతో భూముల కొలతలు తీసుకుని డిజిటల్ రూపంలో వివరాలను భద్రపరుస్తున్నాం. ఈ వివరాలన్నింటినీ భూ భారతి పోర్టల్లో నమోదు చేస్తున్నాం. ఈ మేరకు భూయజమానులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం. పాలేరు నియోజకవర్గంలో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ చేస్తాం. కాగా, నేలకొండపల్లి మండలం కొంగరలో 665 ఎకరాల్లో వందశాతం రీసర్వే పూర్తి అయింది’ అని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
చిత్తూరులో ప్రశాంతంగా నామినేషన్లు.. మదనపల్లెలో స్నేహపూర్వక వాతావరణం
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం: మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News