Secunderabad Protest: సికింద్రాబాద్‌లో హై టెన్షన్.. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:27 AM
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో పులువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, జనవరి17 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఆందోళనలు(Secunderabad Protest) ఉద్ధృతమయ్యాయి. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు, కార్మిక సంఘాలు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు.
తీవ్ర ఉద్రిక్తత..
ఆందోళనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మహిళలు ర్యాలీ చేస్తూ నిరసనకు దిగారు. వీరిని అడ్డుకునే క్రమంలో.. ఓ కానిస్టేబుల్‌కు గాయపడగా చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఆందోళనకారులు వాపోయారు. తమ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
భారీ ర్యాలీకి బీఆర్ఎస్ పిలుపు..
మరోవైపు.. సికింద్రాబాద్ సాధన పేరుతో శనివారం భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. కాగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టాలని మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తొలుత నిర్ణయించారు. అయితే.. ఈ ఆందోళనను వారు విరమించుకున్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం కోర్టుకు వెళ్లి అనుమతులు తీసుకొని ఫిబ్రవరి మొదటి వారంలో మళ్లీ ఈ నిరసన కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
ర్యాలీకి అనుమతి లేదు: హైదరాబాద్ జాయింట్ సీపీ
తెలంగాణ భవన్ నుంచి ర్యాలీకి బీఆర్ఎస్ నేతలు యత్నించగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జాయింట్ సీపీ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించి ర్యాలీ చేపడితే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.
ర్యాలీ ప్రారంభం..
మోండా మార్కెట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపునకు ఆందోళనకారులు ర్యాలీ చేపట్టారు. ‘మల్కాజ్‌గిరి హటావో.. సికింద్రాబాద్ బచావో’ వంటి నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీ మోండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ ప్రాంతాల వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వ్యాపారులు, కార్మిక సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
పోలీసుల చర్యలు..
ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని గోపాలపురం పీఎస్‌కు తరలించారు. లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్‌ను అరెస్ట్ చేయడం సహా ఎంజీ రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న పలువురు నేతలనూ అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై చర్యలు చేపట్టారు అధికారులు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని ఖాళీ చేయించడంతో పాటు సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆ నలుగురు సీఎంలపై మంత్రి తుమ్మల ఇంట్రస్టింగ్ కామెంట్స్..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు బ్రేక్
Read Latest Telangana News And Telugu News