Share News

నీళ్ల విషయంలో కేటీఆర్‌ కొత్త డ్రామాలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:20 AM

నీళ్ల విషయంలో తెలంగాణకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ద్రోహం, తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకే నాగార్జునసాగర్‌పై కేటీఆర్‌ కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు.

నీళ్ల విషయంలో కేటీఆర్‌ కొత్త డ్రామాలు
Mahesh Kumar Goud

  • సాగర్‌ నియంత్రణను కేంద్రానికి అప్పగించింది బీఆర్‌ఎస్‌ సర్కారు కాదా..?

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌/నల్లగొండ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నీళ్ల విషయంలో తెలంగాణకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ద్రోహం, తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకే నాగార్జునసాగర్‌పై కేటీఆర్‌ కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. అసలు నాగార్జునసాగర్‌ డ్యామ్‌ నియంత్రణను కేంద్ర ప్రభుత్వ సంస్థ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ డ్యామ్‌ నియంత్రణ కేంద్రం చేతిలో ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కమాట కూడా ఎందు కు అనలేదంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం కేటీఆర్‌ చేస్తున్నాడంటూ ఆరోపించారు.


గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ నీటిలో తెలంగాణ వాటా విషయమై ప్రజా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కృష్ణా బేసిన్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహేశ్‌గౌడ్‌ స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి.. ఆయనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఏ సందర్భంలో ఏమి మాట్లాడారో అన్ని విషయాలనూ పరిశీలిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామిక పార్టీ అని, అన్నింటినీ పరిశీలించాకనే హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు.


పార్టీ కొత్త ఇన్‌చార్జ్‌ సందీప్‌ ఈనెల 22న రాష్ట్రానికి వస్తున్నారని, ఆయన వచ్చాక అన్ని అంశాలను పరిశీలిస్తారని చెప్పారు. కాగా, డిసెంబరు 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించే బీసీ జనభేరి సభలో పాల్గొనాలని మహేశ్‌గౌడ్‌ను బీసీ సంఘాల నేతలు ఆహ్వానించారు. గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్‌ను కలిసిన సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఈ మేరకు ఆహ్వానం పలికారు. కాగా, ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ బలంపై గెలవలేదని భావిస్తే పార్టీ నుంచి వెళ్లిపోవాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పున్న కైలాష్‌ నేత అన్నారు. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారశైలిపై ఏఐసీసీకి, టీపీసీసీకి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పా రు. ఎవరికి లాభం చేయడానికి ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్‌లపై పదే పదే విమర్శలు చేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ గౌడ్‌ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 01:20 AM