హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:46 PM
కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుబట్టలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని.. బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పలువురికి నోటీసులు ఇవ్వలేదని మాత్రమే హైకోర్టు చెప్పిందని వివరించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుబట్టలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ విచారణ చేసి ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పుపట్టలేదన్నారు.
లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయిందని.. లక్ష కోట్లు వృథా చేశారని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. కమీషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదన్నారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఏటీఎంలా మారిందని అమిత్ షా, నడ్డా చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు చెప్పిన కొన్ని అంశాలను చూసి సంబరాలు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌పై మహేశ్ గౌడ్ మండిపడ్డారు. పీసీ గోష్ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎన్‌డీఎస్‌ఏ కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కాళేశ్వరంలో నిర్మాణ లోపాలు ఉన్నాయని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని తెలిపారు. హైకోర్టు ఎక్కడా కూడా బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడలేదని చెప్పలేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ వారి హయాంలోనే కూలిందన్నారు. ఆలస్యమైనా దోషులు జైలుకు వెళ్లక తప్పదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
మరో సకల జనుల సమ్మెగా మారుస్తాం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న
హైకోర్టు తీర్పు ఎవరికీ చెంపపెట్టు కాదు: కోదండరాం
Read Latest Telangana News And Telugu News