మరో సకల జనుల సమ్మెగా మారుస్తాం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:26 PM
ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 22: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరవీరులకు నివాళులర్పించి సమ్మెను ముందుకు తీసుకెళ్తామని.. కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాలయాపన కోసమే ప్రభుత్వం కమిటీ వేసిందని విమర్శించారు. కమిటీ అవసరం లేదని.. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు జేఏసీ చైర్మన్ తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను సర్కార్ వెంటనే ప్రారంభించాలని వెంకన్న డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని.. వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. ప్రజా సంఘాలు సంపూర్ణంగా మద్దతిచ్చాయని... మరో సకల జనుల సమ్మెగా మారుస్తామని అన్నారు. సమ్మెకు మంద కృష్ణ మాదిగ, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించాలని.. మరో సకల జనుల సమ్మె కాకుండా చూసుకోవాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం: హరీశ్ రావు
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
Read Latest Telangana News And Telugu News