Share News

ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం: హరీశ్ రావు

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:08 PM

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యిందన్నారు.

ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం: హరీశ్ రావు
Harish Rao

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పీసీ ఘోష్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి స్పందించారు. ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని, రేవంత్ నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యిందంటూ హరీశ్ పోస్ట్ చేశారు.


హరీశ్ రావు ట్వీట్...

‘సత్యమేవ జయతే.. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా... ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం.. జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

కాళేశ్వరంపై ఘోష్ కమిషన్‌ నివేదికను నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 12:24 PM