Share News

కాళేశ్వరంపై ఘోష్ కమిషన్‌ నివేదికను నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు

ABN , Publish Date - Apr 22 , 2026 | 10:50 AM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

కాళేశ్వరంపై ఘోష్ కమిషన్‌ నివేదికను నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు
Telangana High Court

హైదరాబాద్, ఏప్రిల్ 22: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) ఊరట లభించింది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ధర్మాసనం నిలిపివేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని న్యాయస్థానం తెలిపింది. అయితే రిపోర్ట్‌ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిటిషనర్లు కేసీఆర్‌, హరీశ్‌ రావుతో పాటు స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషికి ఊరట లభించినట్లైంది.


కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో జీవో నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. అయితే ఘోష్ కమిషన్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషి పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 8న వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు ఈరోజుకు(ఏప్రిల్ 22) వాయిదా వేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 6ను సమర్థించిన హైకోర్టు.. జీవో నంబర్ 6ను ఆధారంగా ఏర్పాటైన కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియా ముందుకు తీసుకురావడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.


హైకోర్టు తీర్పుతో కేసీఆర్‌కు ఊరట: అడ్వకేట్ గండ్రమోహన్ రావు

కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతో కేసీఆర్‌కు ఊరట లభించిందని మాజీ సీఎం అడ్వకేట్ గండ్రమోహన్‌ రావు తెలిపారు. హైకోర్టు తీర్పుతో కమిషన్ రిపోర్టును చెత్తలో పడేయవచ్చన్నారు. సెక్షన్ 8 కింద విచారణ జరగలేదని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించిందని తెలిపారు. అయితే కమిషన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తు చేయరాదని న్యాయస్థానం చెప్పిందని కేసీఆర్ అడ్వకేట్ గండ్రమోహన్‌ రావు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

డ్రైవర్‌ హత్య కేసులో సాక్షులకు బెదరింపులు.. అనంత బాబు కోసం పోలీసుల గాలింపు

మద్యం మత్తులో తల్లితో గొడవ.. అడ్డుకోబోయిన తండ్రిని

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 11:30 AM