ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..
ABN , Publish Date - Apr 22 , 2026 | 09:24 AM
తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న(మంగళవారం) జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న(మంగళవారం) జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందే అంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాగా, ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు.
హైదరాబాద్ జిల్లా..
నగరవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె ప్రభావంతో బస్సులు రోడ్డెక్కక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే బస్టాండ్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా..
ఆదిలాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల్లో 641 బస్సులు నిలిచిపోయాయి. సమ్మెలో 1,946 మంది కార్మికుల పాల్గొంటున్నారు. డిపోల వద్ద కార్మిక సంఘాలు పెద్దఎత్తున నిరసనలకు దిగాయి. దీంతో అద్దె బస్సులు నడిపించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాలు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అన్ని బస్సులూ డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల్లో వందలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. బస్సులు నడవక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఖమ్మం జిల్లా..
ఖమ్మంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడా రోడ్డెక్కడం లేదు. కార్మికులు అర్ధరాత్రి నుంచే సమ్మె బాట పట్టారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర బస్ డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ డిపోల వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. డిపోల్లోనే బస్సులన్నీ నిలిచిపోయాయి. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
సిద్దిపేట జిల్లా..
ఆర్టీసీ సమ్మెలో భాగంగా సిద్దిపేట డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. కార్మికులు డిపో ఎదుట బైఠాయించి సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా..
ఉమ్మడి జిల్లాలోని పది డిపోలకు చెందిన 850 బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే 3,850 మంది కార్మికులు సమ్మెకు దిగారు.
ఈ వార్తలు కూడా చదవండి
కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
ఆర్టీసీ బస్సులు బంద్.. మెట్రో రైళ్లు, ఆటోలకు పెరిగిన డిమాండ్..