Share News

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:44 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్
Ajit Pawar Death

హైదరాబాద్, జనవరి 28: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్(Maharashtra Deputy CM Ajit Pawar) బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


కేసీఆర్ సంతాపం..

అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా ఎదిగి, పలు హోదాల్లో పనిచేసిన పవార్ మరణం ఆ రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

seethakka-minister.jpg

అజిత్ పవార్ అకాల మరణం పట్ల మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం మహారాష్ట్ర రాజకీయాలకు, ప్రజా జీవితానికి తీరని నష్టమని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఈ విషాద సమయంలో పవార్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలిపారామె. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఇవ్వాలని మంత్రి సీతక్క భగవంతుణ్ని ప్రార్థించారు.


టీపీసీసీ చీఫ్ సంతాపం

mahesh-kumar-goud.jpg

అజిత్ పవార్ చనిపోవడం పట్ల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా ఎదిగిన వ్యక్తి అజిత్ పవార్ అని, ఆయన మరణం రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు అని అన్నారు. అజిత్ మృతిపట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.


షాక్‌కు గురయ్యా: కేటీఆర్

ktr-muncipal.jpg

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Former Minister KTR) సంతాపం తెలియజేశారు. అజిత్ పవార్ మరణ వార్త విని షాక్‌కు గురైనట్లు తెలిపారు. అజిత్ పవార్ మృతి ఆ రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి

భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 12:19 PM