Share News

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేస్తారా?

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:17 AM

మహిళా ఎమ్మెల్యేలు, సీనియర్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపై అసెంబ్లీ వద్ద పోలీసులు తీవ్రమైన దాడికి, దాష్టీకానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేస్తారా?
KTR

  • చీరలు లాగి.. గొంతులు పట్టి.. జుట్టు లాగుతారా?..

  • సీఎం రేవంత్‌ క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం

  • దృష్టి మరల్చేందుకే డైవర్షన్‌ రాజకీయాలు

  • తాతా మధు అనని మాటలను ఆపాదిస్తున్నారు

  • ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామనే..

  • సభకు రాకుండా అడ్డుకున్నారు: కేటీఆర్‌

  • మహిళా ఎమ్మెల్యేల చీర లాగిన

  • పోలీసులను వదలం:హరీశ్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మహిళా ఎమ్మెల్యేలు, సీనియర్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపై అసెంబ్లీ వద్ద పోలీసులు తీవ్రమైన దాడికి, దాష్టీకానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా.. వారి చీరలు లాగడం, గొంతులు పట్టుకోవడం, జుట్టు లాగుతూ దాడి చేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే జరిగిందని, ఇందుకు ఆయనే బాధ్యత వహించాలని అన్నారు. దీనిపై క్షమాపణ చెప్పేవరకు సీఎంను వదలబోమని హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్‌ సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దుశ్శాసన పర్వం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలు మొదలుపెట్టారని అన్నారు. ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై సమాధానం చెప్పకుండా తమ ఎమ్మెల్సీ తాతా మధు అనని మాటలను ఆయనకు ఆపాదించి అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న నిరసన తెలిపే హక్కు మేరకు తాము టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు, రాహుల్‌గాంధీ ఇదే తరహా టీషర్టులు ధరించి కూర్చున్నప్పుడు వారిని ఎవరూ అడ్డుకోలేదని గుర్తుచేశారు. హామీల వైఫల్యాన్ని, పరిపాలనా వైఫల్యాన్ని సభలో ఎండగడతామనే భయంతోనే తమను అసెంబ్లీలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకున్నదని, పోలీసులతో దాడులు చేయించిందని ఆరోపించారు.


స్పీకర్‌ పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు

స్పీకర్‌ పదవిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. మహిళా నేతలపై దాడి చేసి.. దాని నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ స్పీకర్‌కు మనస్తాపం కలిగితే తాను అనని మాటకు కూడా తాతా మధు విచారం వ్యక్తం చేశారని, ఈ అంశంలో ఇక చెప్పాల్సిందేమీ లేదని అన్నారు. దళితులపై రేవంత్‌రెడ్డి దొంగప్రేమ ఒలకబోస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. నిజంగానే దళితులపై ప్రేమ ఉంటే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దళిత డిక్లరేషన్‌పై చర్చకు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ విలువలు, సంప్రదాయాల గురించి సీఎం రేవంత్‌ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. శాసనసభలోనే కాకుండా శాసనసభ బయట కూడా అడ్డగోలుగా, నీచమైన బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలో రేవంత్‌రెడ్డి ఒక్కరేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై హైకోర్టును ఆశ్రయించామని కేటీఆర్‌ తెలిపారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పిందన్నారు. తమ దళిత ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి, జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు.


మహిళా ఎమ్మెల్యేల చీరలాగిన పోలీసులను వదిలిపెట్టం: హరీశ్‌

శాసనసభను కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌరవ సభగా మారుస్తోందని బీఆర్‌ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల మెడపట్టి గెంటిన ఈ రోజును తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో బ్లాక్‌డేగా భావించాలన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని... ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ సభ్యులను అసెంబ్లీలోకి రాకుండా.. అధికార కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకొని సభలో బీఆర్‌ఎస్‌ లేకుండా చేస్తున్నాయని, తమను సస్పెండ్‌ చేసేందుకు వ్యూహం పన్నాయని ఆరోపించారు. 22ఏపై, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నామమాత్రపు చర్చ చేస్తారా? అని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చ జరుపుతామంటే ప్రభుత్వం పారిపోయినట్లేనన్నారు. వెయ్యిరోజుల విఫల పాలన వాస్తవాలు బట్టబయలవుతాయని ప్రభుత్వం భయపడిందని, అందుకే తమపై పోలీసులను ప్రయోగించి అమానవీయంగా ప్రవర్తించిందని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యే చీర లాగిన పోలీసులను, సబితమ్మ గొంతునొక్కిన వారిని, జగదీ్‌షరెడ్డిని కిందపడేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆస్పత్రికి కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? అని మండిపడ్డారు. హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కేటీఆర్‌కు, యాదవరెడ్డికి, సంజయ్‌కి గాయాలయ్యాయని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై దుశ్చర్యలకు నిరసనగా అసెంబ్లీ బీఏసీ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశానికి రావాల్సిందిగా తనకు ఫోన్‌ చేసిన అసెంబ్లీ కార్యదర్శికి ఇదే విషయాన్ని చెప్పానన్నారు. అయితే మంగళవారం జరిగే అసెంబ్లీ, మండలి సమావేశానికి తమ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలమంతా హాజరవుతామని అన్నారు. మరోవైపు మంగళవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలంతా శాసనమండలికి హాజరు కావాలని మండలిలో ఆ పార్టీ విప్‌ దేశపతి శ్రీనివాస్‌ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..
జన్వాడ వెంచర్‌పై కొరడా!

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ పోలీస్‌
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 06:19 AM