బీఆర్‌ఎస్ సెల్ఫ్ గోల్..!
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:02 AM
శాసనసభ వర్షాకాల సమావేశాల్లో దూకుడుగా వ్యవహరిద్దామనుకున్న బీఆర్‌ఎ్‌సకు తొలిరోజే ఎదురు దెబ్బ తగిలింది! అధికార పక్షంపై ఎదురు దాడి చేద్దామని భావిస్తే.. సీన్ రివర్స్ అయింది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై ఆ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది.
తొలి రోజే గులాబీ దళం దూకుడు
స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలతో సీన్ రివర్స్
సీరియ్‌సగా తీసుకున్న సీఎం.. చకచకా పావులు
దళిత స్పీకర్‌ను అవమానించిన తాతా మధును
బర్తరఫ్ చేద్దామంటూ సభలో రేవంత్ ప్రతిపాదన
ఆయనను బర్తరఫ్ చేయాలని మండలి చైర్మన్‌ను
కోరుతూ నేడు తీర్మానాన్ని ఆమోదించనున్న సభ
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శాసనసభ వర్షాకాల సమావేశాల్లో దూకుడుగా వ్యవహరిద్దామనుకున్న బీఆర్‌ఎ్‌సకు తొలిరోజే ఎదురు దెబ్బ తగిలింది! అధికార పక్షంపై ఎదురు దాడి చేద్దామని భావిస్తే.. సీన్ రివర్స్ అయింది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై ఆ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. చివరకు, ఆత్మరక్షణలో పడటం ఆ పార్టీ వంతయింది. దూకుడుగా వచ్చి.. వెయ్యి రోజుల పాలన, ఆరు గ్యారెంటీల అమలు తదితరాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయమే నల్ల దుస్తులు ధరించి.. ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. అయితే, నల్ల దుస్తులు, ప్లకార్డులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్లు రాసి ఉండటంతో పోలీసులు వారిని అసెంబ్లీలోకి వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడి నుంచే తమ దూకుడును ప్రారంభించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడం ప్రారంభించారు. పోలీసులు అడ్డుకుంటున్న సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన స్పీకర్ మనస్తాపానికి గురయ్యారు. అదే సమయంలో, ప్రభుత్వ విప్‌లు, పార్టీ దళిత ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. స్పీకర్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, పోలీసులు వారి విధులు నిర్వహించకుండా కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, పోచంపల్లి, మెట్‌పల్లి సంజయ్, నవీన్ రెడ్డి దాడి చేసిన వైనాన్నీ వివరించారు. తాతా మధుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. దళిత స్పీకర్ పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. దాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. చకచకా పావులు కదిపారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. తాతా మధు అనుచిత వ్యాఖ్యలు, పోలీసులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను తెప్పించుకుని పరిశీలించారు. డీజీపీ, నగర కమిషనర్‌లతో సమావేశమై సమీక్షించారు. దళిత స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సభలో చర్చించాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి.. మనస్తాపంతో ఉన్న ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. సభలో చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డినీ ఆయన చాంబర్లో కలిసి.. తాతా మధుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
బర్తర్‌ఫను తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్
వాస్తవానికి, సోమవారం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత సభను వాయిదా వేసి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో అజెండాను ఖరారు చేద్దామనుకున్నారు. స్పీకర్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశ్నోత్తరాల సమయం పక్కకుపోయి.. ఈ అంశంపై సభలో చర్చ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాతా మధును శాసనమండలి నుంచి బర్తరఫ్ చేద్దామన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆయన వ్యాఖ్యలను కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. దీనికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
నేడూ కొనసాగనున్న చర్చ
స్పీకర్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై శాసనసభలో చర్చ మంగళవారమూ కొనసాగనుంది. తాతా మధును శాసన మండలి సభ్యత్వం నుంచి బర్తరఫ్ చేయాలంటూ తీర్మానాన్ని ఆమోదించనుంది. దానిని మండలి చైర్మన్‌కు పంపనుంది. దాని ప్రకారం ఆయన నిర్ణయం తీసుకోనున్నట్లు అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. తాతా మధును బర్తరఫ్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు సభలో బీజేపీ, ఎంఐఎం సభ్యులు ఇప్పటికే మద్దతు పలికారు. అయితే, మంగళవారం సభకు హాజరు కానున్న బీఆర్‌ఎస్ సభ్యులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
బర్తరఫ్ తప్పదా..
శాసన మండలి సభ్యత్వం నుంచి తాతా మధును బర్తరఫ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ అధికారులు, న్యాయ నిపుణులతో సోమవారం శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో ఇంత కంటే చిన్న కారణం చూపి కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాలను కేసీఆర్ తొలగించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల అదుపులో యూట్యూబర్ నందన
బీఆర్‌ఎస్ వర్సెస్ పోలీస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News