అండాల దందా వెనుక కేటీఆర్ కుటుంబం!
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:35 AM
దేశంలో సంచలనం సృష్టించిన ఆడవాళ్ల అండాల అక్రమ విక్రయం (ఐవీఎఫ్) కుంభకోణం కేటీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. ఈ దందాకు సూత్రధారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరేనని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ తీవ్ర ఆరోపణ చేశారు.
ప్రభుత్వ విప్ బల్మూర్ సంచలన ఆరోపణలు..
సద్గురు హెల్త్‌కేర్‌లో కేటీఆర్ భార్య శైలిమకు వాటాలు
2015లో 4 శాతం.. 2019 నాటికి 2.4 శాతం
బీఆర్‌ఎస్ హయాంలోనే వ్యాపార బంధం
సంస్థ ఎండీ సూర్యకిరణ్ కేటీఆర్ బాల్యమిత్రుడు, బినామీ
‘అమ్మా శైలిమా.. కొంచెం జాగ్రత్త!‘
కవితను ఇరికించినట్లే మిమ్మల్నీ ఇరికిస్తాడు
ఫార్ములా ఈ రేసు లీగల్ టీమే సూర్యకిరణ్ కోసం ఆధారాలన్నీ పోలీసులకు అందజేస్తా: బల్మూర్
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): దేశంలో సంచలనం సృష్టించిన ఆడవాళ్ల అండాల అక్రమ విక్రయం (ఐవీఎఫ్) కుంభకోణం కేటీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. ఈ దందాకు సూత్రధారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరేనని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ తీవ్ర ఆరోపణ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓయాసిస్ ఫెర్టిలిటీ పేరుతో సంతాన సాఫల్య కేంద్రాలు నడుపుతోంది. ఆ సంస్థలో కేటీఆర్ భార్య శైలిమ వాటాదారుగా ఉన్నారని ఆయన వెల్లడించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ వాటాలు ఉన్నాయని తెలిపారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట సూర్యకిరణ్ గేదెల కేటీఆర్ బాల్యమిత్రుడని, ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పారు. బుధవారం సీఎల్పీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కొన్ని కంపెనీ రికార్డులను ప్రదర్శించారు.
వాటి ప్రకారం సద్గురు హెల్త్‌కేర్‌లో శైలిమ వాటా 2015 మార్చి 25న 4 శాతం, 2016 అక్టోబరు 7న 2.7 శాతం, 2019 డిసెంబరు 2న 2.4 శాతంగా ఉంది. జెన్‌మెడ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శైలిమ, సూర్యకిరణ్ ఇద్దరూ డైరెక్టర్లుగా ఉన్నారని వెంకట్ ఆరోపించారు. తన దగ్గర ఉన్న పత్రాలన్నీ పోలీసులకు అందజేస్తానని ప్రకటించారు. తెలంగాణలో ఎలాంటి భయం లేకుండా ఇంత పెద్ద దందా ఎలా జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందన్నారు. సూర్యకిరణ్ కేటీఆర్‌కు బినామీ అని ఆరోపించారు. గేదెల సూర్యకిరణ్ తన చెడ్డీ దోస్త అని కేటీఆరే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గుర్తుచేశారు. జన్వాడ ఫామ్‌హౌస్ ప్రదీ్‌పరెడ్డి కూడా కేటీఆర్‌కు చెడ్డీ దోస్తేనని అన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఇంటీరియర్స్‌ను డిజైన్ చేసింది సూర్యకిరణ్ భార్య మేఘ అని తెలిపారు. ఇలాంటి దందాలు చేసుకునేలా వారిని ప్రోత్సహించింది కేటీఆరేనని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సద్గురు హెల్త్‌కేర్ సర్వీసె్‌సకు సుల్తాన్‌పూర్‌లో భూములు కేటాయించిందని చెప్పారు. ఈ దందాను బయటపెట్టిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.
‘అమ్మా శైలిమా.. జాగ్రత్త!‘
వెంకట్ నేరుగా శైలిమను ఉద్దేశించి మాట్లాడారు. ‘అమ్మా శైలిమా.. నువ్వు కొంచెం జాగ్రత్త! కేటీఆర్ ఎంతకైనా తెగించే వ్యక్తి. మీ ఆడబిడ్డ కవితను ఇరికించినట్లే మిమ్మల్నీ ఇరికించే ప్రయత్నం చేస్తాడు, జాగ్రత్త! ఎక్కడ సంతకం పెట్టినా కొంచెం చూసి పెట్టు. అదే నీకు మంచిది‘ అని సూచించారు. సూర్యకిరణ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ లీగల్ టీమ్ ప్రయత్నిస్తోందన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు బెయిల్ కోసం పనిచేసింది ఇదే లీగల్ టీమ్ అని, గతంలో ఆయన బావమరిది కేసుల్లోనూ వీరే వాదించారని తెలిపారు. ఇలాంటి పనులకు సూత్రధారి అయిన కేటీఆర్‌ను ఆడబిడ్డలు క్షమించే పరిస్థితి లేదన్నారు. ఈ దందాలో రాజకీయ ప్రమేయంపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే సూర్యకిరణ్‌ను పోలీసులకు లొంగిపోయేలా చేయాలని సవాల్ విసిరారు. గేదెల కుటుంబంతో తమ వ్యాపార సంబంధాలపై కేటీఆర్ నోరు విప్పాలని, తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముగ్గురు బ్రోకర్ల కస్టడీకి పిటిషన్
నాంపల్లి కోర్టులు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇదే కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను 5 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మలక్‌పేట్ పోలీసులు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆ ముగ్గురు: బ్రోకర్ అమిత్ శర్మ (ఏ2), నిఖత్ పర్వీన్ (ఏ3), ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్ (ఏ4). వీరిని ఇటీవల పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి 7వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించింది. మలక్‌పేట్‌లో సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌ను నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులనూ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారి సద్గురు ఫె3ఈర్టిలిటీ సెంటర్‌ను సందర్శించి కీలక రికార్డులు, సాక్ష్యాధారాలు జప్తు చేశారు.
66 మంది మహిళలను దాతలుగా నమోదు చేశారు, కానీ రికార్డుల్లో 47 మంది వివరాలే ఉన్నాయి. మిగిలిన 19 మంది వివరాలపై ఆరా తీయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్ ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను రప్పించారు. వారిని బేగంపేట్‌లోని అమినిత మహిళా వసతి గృహంలో ఉంచి అండాలు సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు తరలించినట్లు ఆధారాలు లభించాయని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుట్లా శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదైంది. ఫిర్యాదుదారుడి వాంగ్మూలం నమోదు చేసి సంబంధిత రికార్డులను కోర్టుకు సమర్పించినట్లు దర్యాప్తు అధికారి తెలిపారు. పోలీసులు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా, కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్ వెస్లీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News