Water Dispute: అపెక్స్ కౌన్సిల్‌కు నీటి పంపిణీ బాధ్యత!
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:06 AM
కృష్ణా జలాల పంపిణీ అంశం ట్రైబ్యునల్-2 పరిధిలో అపరిష్కృతంగా ఉండటంతో ఈలోగా ఆ బాధ్యతను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉండే అత్యున్నత మండలి (అపెక్స్ కౌన్సిల్)కి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
తాత్కాలికంగా అప్పగించేలా తీర్మానం చేయాలి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ
పోతిరెడ్డిపాడు, బనకచర్ల ఔట్‌లెట్లపై విధిగా టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలి
పోలవరం-నల్లమల సాగర్ డీపీఆర్ తయారీపై ఏపీని నిలువరించాలి
అజెండాలో చేర్చాలని ప్రతిపాదనలు
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీ అంశం ట్రైబ్యునల్-2 పరిధిలో అపరిష్కృతంగా ఉండటంతో ఈలోగా ఆ బాధ్యతను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉండే అత్యున్నత మండలి (అపెక్స్ కౌన్సిల్)కి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖను కోరుతూ తీర్మానం చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు ప్రతిపాదించింది. త్వరలో జరగనున్న కృష్ణా బోర్డు 21వ సమావేశం అజెండాలో రాష్ట్రంతరఫున చేర్చాల్సిన అంశాలపై నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటును కొనసాగించాలని బోర్డు 19వ సమావేశంలో నిర్ణయించినట్టు మినిట్స్‌లో రికార్డు చేయడాన్ని తెలంగాణ తప్పుపట్టింది. 50:50నిష్పత్తిలో తాత్కాలిక పంపకాలు జరపాలని ఆ సమావేశంలో తాము పట్టుబట్టామని గుర్తుచేసింది.
అజెండా అంశాలివీ..
పోలవరం విస్తరణను నిలువరించాలి
పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ టెండర్ల ప్రక్రియ నిర్వహించకుండా అడ్డుకోవాలని, అలాగే ఆ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎఫ్‌ఆర్)ను బోర్డు పరిశీలించకూడదని తెలంగాణ కోరింది. ‘శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, హంద్రీనీవా సుజల స్రవంతి, శ్రీశైలం కుడి గట్టు కాలువ, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, ఎస్కేప్ చానల్, నిప్పుల వాగు ద్వారా ఏపీ బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలిస్తున్న కృష్ణా జలాలను ఆ రాష్ట్ర వాటా కింద లెక్కలోకి తీసుకోవాలి. మూడో విడత కింద మరో 11 చోట్ల టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలి. దీనికి తెలంగాణ రూ.4.15కోట్లను కృష్ణా బోర్డుకు విడుదల చేసినా చర్యలు తీసుకోకపోవడం తగదు. శ్రీశైలం జలాశయం వద్ద ప్లంజ్‌పూల్ (భారీ గుంత)తో డ్యామ్ భద్రత ప్రమాదంలో పడిందని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని, రెండేళ్లు పూర్తైనా ఏపీ మరమ్మతులు చేపట్టలేదని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ‘తక్షణమే డ్యామ్‌కు మరమ్మతులు నిర్వహించాలి. పనులన్నీ కృష్ణా బోర్డు పర్యవేక్షణలో జరగాలి. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు చేపట్టాలి. ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలి. రాయలసీమ పనుల విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా కట్టడి చేయాలి. ఏపీ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులపై బోర్డు సమావేశంలో చర్చించాలి’ అని పేర్కొంది.
సాగర్‌ను తెలంగాణకు అప్పగించాలి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా తమకు తిరిగి అప్పగించాలని తెలంగాణ కోరింది. ‘2023 నవంబరు 29న ఏపీ బలవంతంగా సాగర్‌పైకి చొచ్చుకువచ్చి కుడి రెగ్యులేటరీ ద్వారా నీళ్లను విడుదల చేసుకుంది. డ్యామ్ భద్రత చట్టం ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ పరిధిలోనే వస్తుంది. అత్యవసర మరమ్మతులకు తెలంగాణ అధికారులను అనుమతించకపోవడంతో డ్యామ్ భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. సాగర్ ఎడమ కాల్వలో నీటి నష్టాలను లెక్కిస్తేనే వాడుకుంటున్న నీళ్లపై కచ్చితమైన లెక్కలు తెలుస్తాయి. దీనికి గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలి. తెలంగాణ నీళ్లను పొదుపుగా వాడుకుని వచ్చే నీటి సంవత్సరం కోసం నిల్వ చేస్తోంది. తాగునీటి కోసం వాడుకుంటున్న జలాల్లో 20శాతాన్నే లెక్కించి మిగతా 80శాతాన్ని రిటర్న్ ఫ్లోగా పరిగణించాలి’ అని డిమాండ్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..
పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Read Latest Telangana News And Telugu News