సురేఖ బర్తరఫ్
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:22 AM
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చిట్టచివరకు క్రమశిక్షణకే ఓటు వేసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసులను ఆమోదిస్తూ కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై కఠిన నిర్ణయం తీసుకుంది.
మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం
గవర్నర్‌కు సిఫారసు.. వెంటనే ఆమోదం
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తొలగింపు
ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మి నియామకం
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద
వరంగల్ ‘కుడా’ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి
ముగ్గురు బీసీ మహిళలకు నామినేటెడ్ పోస్టులు
సీఎంపై సురేఖ కూతురి వ్యాఖ్యలతో మొదలైన వివాదం
వివరణ అడిగితే ఎదురుదాడికి దిగిన సురేఖ
మంత్రివర్గం నుంచి తొలగించాలని పీసీసీ సిఫారసు
క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు ఉంటాయని సంకేతం
హైదరాబాద్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చిట్టచివరకు క్రమశిక్షణకే ఓటు వేసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసులను ఆమోదిస్తూ కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై కఠిన నిర్ణయం తీసుకుంది. అధిష్ఠానం సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని గురువారం సాయంత్రం గవర్నర్‌కు సిఫారసు చేశారు. సీల్డ్ కవర్‌లో ఉంచిన సిఫారసు లేఖను సీఎంవో కార్యదర్శి శేషాద్రి స్వయంగా గవర్నర్ శుక్లాకు అందించారు. ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. అలాగే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా చిన్నారెడ్డి నియామకాన్ని కూడా ముఖ్యమంత్రి రద్దు చేశారు. ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించారు. అందుకు సంబంధించి ప్రభుత్వం గురువారమే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తమ్మీద ఆగస్టు 18న కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మొదలైన వివాదం మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌కు దారి తీసింది. కొండా సురేఖ బీసీ మహిళ కావడం.. మున్నూరు కాపు, పద్మశాలీ సామాజిక వర్గాలకు తాను ప్రతినిధినంటూ ఆమె ప్రస్తావిస్తూ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఒక బీసీ మహిళకు బదులుగా ముగ్గురు బీసీ మహిళలను కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమితులైన గద్వాల విజయలక్ష్మి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ. గద్వాల విజయలక్ష్మి మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఆమెను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో ఖాళీ అయిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిలో గౌడ సామాజిక వర్గానికి చెందిన నేరెళ్ల శారదను సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. నిజానికి విజయలక్ష్మికి ముందు శారద మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె పదవీకాలం ముగియడంతో విజయలక్ష్మికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు విజయలక్ష్మికి వేరే పదవి దక్కడంతో తిరిగి శారదను నియమించారు. అలాగే వరంగల్ నగరానికి సంబంధించి కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని రెండేళ్ల పదవీ కాలానికి నియమించారు. గుండు సుధారాణి పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. మొత్తమ్మీద కొండా సురేఖ.. భర్త సామాజిక వర్గమైన మున్నూరు కాపు, సురేఖ జన్మించిన పద్మశాలీ సామాజిక వర్గాలను క్లెయిమ్ చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం బీసీ మహిళలు గద్వాల విజయలక్ష్మి, గుండు సుధారాణి, నేరెళ్ల శారదలను కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో నియమించి నష్టాన్ని నివారించే ప్రయత్నం చేసింది. 2024లో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా చిన్నారెడ్డినియామకానికి సంబంధించి అప్పుడు జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ తాజాగా గురువారం జీవో జారీ అయ్యింది.
చినికి చినికి ముదిరిన వివాదం!
సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మితా పటేల్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. చివరికి అది మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తర్‌ఫకు దారి తీసింది. సీఎం రేవంత్‌రెడ్డి పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకా్‌షరెడ్డే మళ్లీ పోటీ చేస్తారని యథాలాపంగా చెప్పారు. ఆగస్టు 19న పరకాల నియోజకవర్గం గీసుకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో కొండా సుస్మిత మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసేది తానేనని, అభ్యర్థిని ప్రకటించడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎవరు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, రేవూరి ప్రకా్‌షరెడ్డిలపైన ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను ఓ కేసులో పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చినప్పుడూ అడ్డుకున్న సుస్మిత ఆ సందర్భంగానూ సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మధ్యవర్తిత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అప్పటికి సద్దు మణిగింది. మరోసారి కొండా సుస్మిత తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి దాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సైతం కొండా సుస్మిత వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాల్సిందిగా కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, తనకు నోటీసులు పంపడం సరికాదని, ఆ నోటీసుకు కొండా సురేఖ వివరణ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ విప్‌లు, పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొండా సురేఖ తీరును తప్పు పట్టారు. ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని బలహీన పరిచే విధంగా సుస్మిత మాట్లాడితే బాధ్యత గల మంత్రిగా కొండా సురేఖ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. పార్టీ క్రమశిక్షణ తప్పిన వారు ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అధిష్ఠానాన్ని వారు కోరారు. ఎమ్మెల్యేలతో ఎవరో వెనుక ఉండి మాట్లాడిస్తున్నారని, మంత్రిపై క్రమశిక్షణ తప్పి మాట్లాడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ రాశారు. మరోవైపున వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన ఫిర్యాదు అప్పటికే క్రమశిక్షణా కమిటీ వద్ద ఉంది. షోకాజ్ నోటీసుకు సురేఖ వివరణ, గతంలో పలు వివాదాలకు ఆమె కేంద్ర బిందువు కావడం, మెజార్టీ ఎమ్మెల్యేలు వెల్లడించిన అభిప్రాయం వంటివన్నీ పరిశీలించిన క్రమశిక్షణా కమిటీ.. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ సిఫారసు చేసింది. అలాగే చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలనీ పేర్కొంది. ఈ మేరకు సమగ్ర నివేదికను టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్‌కు కమిటీ చైర్మన్ మల్లు రవి సమర్పించారు. ఆ నివేదికకు తన సూచనలూ జోడించిన మహే్‌షగౌడ్, దాన్ని అధిష్ఠానానికి పంపారు. అప్రమత్తమైన కొండా సురేఖ, మురళిలు అధిష్ఠానం చర్యలు తీసుకోకుండా తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనూ మరళి కలిశారు. అయితే వివాదం అధిష్ఠానం కోర్టులోకి వెళ్లిందని డిప్యూటీ సీఎం సైతం వారికి స్పష్టం చేశారు.
సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్న అధిష్ఠానం
క్రమశిక్షణా కమిటీ సిఫార్సులపైన అధిష్ఠానం విస్తృతంగా అభిప్రాయాలను సేకరించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్.. ఈ నెల 1, 2 తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ సహా పలువురు ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరిపారు. కొండా సురేఖ కుటుంబం పదే పదే పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తోందని, కఠిన చర్యలు తీసుకుని ఇతర నాయకులకూ ఒక హెచ్చరిక ఇవ్వాల్సిందేనని ఈ సంప్రదింపుల ప్రక్రియలో సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయం తీసుకున్న అనంతరం కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్న అభిప్రాయానికి అధిష్ఠానం వచ్చింది. అయితే ఢిల్లీలో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కొండా సురేఖా ఢిల్లీకి చేరుకుని అధిష్ఠానం పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆమె కలిశారు. ఆ సందర్భంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లుగా కొండా సురేఖకు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఖర్గేను కలిసిన అనంతరం మీడియాతో కొండా సురేఖ మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి మీద, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కభార్యపైన, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిపైన తీవ్ర ఆరోపణలు చేశారు. దాంతో రాజీకి తలుపులు మూసుకుపోయాయి. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం ఉన్న కొండా సురేఖ స్వచ్చంగా రాజీనామా చేస్తారని అధిష్ఠానం పెద్దలు భావించారు. బుధవారం సాయంత్రం వరకు అలాంటి సూచన లేకపోవడంతో మంత్రివర్గం నుంచి తొలగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం అనుమతిని ఇచ్చింది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సిఫారసు చేశారు.
కట్టు తప్పితే ఇక వేటే!
సురేఖపై వేటు వేస్తే సామాజిక పరంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందంటూ రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు అధిష్ఠానాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిపైనే విమర్శలు చేసినా ఉపేక్షిస్తే ప్రభుత్వమూ, పార్టీ ప్రజల్లో చులకనవుతుందన్న అభిప్రాయానికి వచ్చిన అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ప్రభుత్వంపై, పార్టీపైస్వప్రయోజనాల కోసం ఏ నాయకుడూ ఒత్తిడి చేయకుండా ఒక హెచ్చరిక చేసినట్లు చెబుతున్నారు. అధిష్ఠానం చర్యలతో అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డికి మరింత పట్టు పెరగనుందని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
kumaram bheem asifabad- వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం
2027 అక్టోబరు నుంచి భారత్ ఎన్‌క్యాప్ 2.0
Read Latest Telangana News And AP News And National News
And Telugu News