ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:20 AM
Land survey process accelerated జిల్లాలో భూసర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు, ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ వినతుల పరిష్కారంలో జాప్యానికి తావులేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.
రీసరే ్వ పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూసర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు, ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ వినతుల పరిష్కారంలో జాప్యానికి తావులేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్రతీ అధికారి ఈ-ఆఫీసు విధానాన్ని పక్కాగా అమలు చేయాలి. సివిల్ కోర్టు కేసులు, వివాదాస్పద భూముల కేసుల పరిష్కారం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. రెవెన్యూ సేవలకు సంబంధించి ప్రజలకు వివిధ ధ్రువపత్రాలను నిర్దేశిత గడువులోగా జారీచేయాలి. రీసర్వే పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేద’ని హెచ్చరించారు. జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ ‘రెవెన్యూ క్లినిక్, ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలి. జిల్లాలో ఆరోవిడత కింద 160 గ్రామాల్లోని 97,917.996 ఎకరాల ప్రైవేటు భూమికి సంబంధించి రీసర్వే ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటివరకు 22,252 నోటీసులు జారీచేశాం. 36,228.292 ఎకరాల్లో ఈకెవైసీ పూర్తయింద’ని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ల వారీగా పనుల పురోగతిని, పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సిగ్నల్ వ్యవస్థ లేని 70 గ్రామాల్లో గ్రౌండ్‌ట్రూతింగ్ పనులు, 33 గ్రామాల్లో డ్రాఫ్ట్ పట్టాదారు పాస్ పుస్తకాల ప్రక్రియను గడువులోగా ముగించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.