కొండా సురేఖ మదిలో ప్లాన్ బి?
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:10 AM
నికి చినికి గాలివానలా మారిన కొండా సురేఖ వివాదం.. ఢిల్లీలో బుధవారంనాటి పరిణమాలను చూస్తే పతాక స్థాయికి చేరుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఈ వివాదం విషయంలో ఆమె తొలి నుంచీ ఏ మాటపై ఉన్నారో.. దాన్నే కొనసాగించారు.
అందుకే సీఎం, డిప్యూటీ సీఎంపై విమర్శలా
కాంగ్రెస్ పార్టీని కబ్జా చేస్తున్నారంటూ
రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు
కాకతాళీయమేనా?.. కాంగ్రెస్ వర్గాల్లో చర్చ
హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): చినికి చినికి గాలివానలా మారిన కొండా సురేఖ వివాదం.. ఢిల్లీలో బుధవారంనాటి పరిణమాలను చూస్తే పతాక స్థాయికి చేరుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఈ వివాదం విషయంలో ఆమె తొలి నుంచీ ఏ మాటపై ఉన్నారో.. దాన్నే కొనసాగించారు. తన కూతురు వ్యాఖ్యలకు, తనకు సంబంధం లేదని, తనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపడమే తప్పని మరోసారి కుండ బద్దలుగొట్టారు. అంతేకాదు.. పదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానంటూ రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలపై వచ్చిన కమీషన్ల ఆరోపణల మాటేంటని నిలదీశారు. తద్వారా.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని తనకు సూచిస్తే.. తాను పార్టీకి భిన్న వైఖరిని తీసుకుంటానన్న సంకేతాన్ని ఇచ్చారు. అయితే ఆమె చివరి ప్రయత్నంగా ఇలా ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తున్నారా.. లేక కొండా కుటుంబం వద్ద ‘ప్లాన్ బి’ ఏదైనా ఉందా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. తన బిడ్డ సుస్మితా పటేల్ ‘ప్లాన్ ఎ’ని అమలు చేసిందని.. ఆమె ‘ప్లాన్-బి’ ఏమిటో తనకు తెలియదని.. కొండా మురళి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. మరో వైపు..బుధవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డివర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్లు కాంగ్రెస్ పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారని.. తెలంగాణలో మళ్లీ వైఎ్‌సఆర్ పాలన తీసుకు వస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి కాంగ్రె్‌సలో చేరేటప్పుడు.. ‘‘అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామ’’ని అధిష్ఠానం తనకు హామీ ఇచ్చిందంటూ రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో చెబుతున్న సంగతి తెలిసిందే. దానికితోడు అడపాదడపా ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలూ చేస్తున్నారు. ఒక రకంగా ఇది రాజగోపాల్‌రెడ్డి ఒత్తిడి వ్యూహమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో.. అటు ఢిల్లీలో కొండా సురేఖ, ఇటు బ్రాహ్మణ వెల్లంలలో రాజగోపాల్‌రెడ్డి.. ఒకేసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కాకతాళీయంగా జరిగినదేనా అన్న చర్చకూడా కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది.
ఒత్తిడి వ్యూహం వికటించిందా?
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. నియోజకవర్గ పునర్విభజనలో ఏ నియోజకవర్గం ఉంటుందో.. ఏది రిజర్వుడు కేటగిరీ కింద పోతుందో అన్నది ఇంకా స్పష్టత లేదు. పైగా కొండా సురేఖ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరకాల నియోజకవర్గం టిక్కెట్టు గురించి కొండా సుస్మిత ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేయడంతోపాటు.. తన తండ్రిని ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్న అంశాన్ని పదేపదే ప్రస్తావించడం గమనార్హం. వాస్తవానికి సీఎంపై తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ ఖండించి ఉంటే వివాదం ఇక్కడిదాకా వచ్చేది కాదని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కొండా మురళికి పదవి కోసం అమలు చేసిన ఒత్తిడి వ్యూహం వికటించి.. చివరికి సురేఖ పదవికి ఎసరు తీసుకువచ్చిందా అన్న చర్చ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎప్పుడూ సమావేశాలే అంటే పనెప్పుడు చెయ్యాలి?
ఔషధాల కొనుగోల్‌మాల్‌లో బిగుస్తున్న ఉచ్చు!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News