Share News

ఔషధాల కొనుగోల్‌మాల్‌లో బిగుస్తున్న ఉచ్చు!

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:27 AM

తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ) మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కౌటిల్యతో పాటు ఇతర అధికారులపై వచ్చిన టెండర్ల అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, జీవో నంబర్‌ 140 ఉల్లంఘనల ఫిర్యాదులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ విచారణ ముమ్మరం చేసింది.

ఔషధాల కొనుగోల్‌మాల్‌లో బిగుస్తున్న ఉచ్చు!
TGMSIDC

  • టీజీఎంఎ్‌సఐడీసీ టెండర్ల అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ వేగవంతం

  • 9 ఆస్పత్రుల సూపరింటెండెంట్లను నేరుగా విచారించిన అధికారులు

  • ఎవరి ఒత్తిడితో ఇండెంట్లు పెట్టారు.. మాన్యువల్‌గా ఎందుకు పెట్టారు?

  • కీలక సమాచారం రాబట్టిన విజిలెన్స్‌..

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కౌటిల్యతో పాటు ఇతర అధికారులపై వచ్చిన టెండర్ల అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, జీవో నంబర్‌ 140 ఉల్లంఘనల ఫిర్యాదులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ విచారణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వివరాలు, వాంగ్మూలం నమోదు చేసేందుకు పలు ఆస్పత్రుల సూపరింటెండెంట్లను నేరుగా విచారించింది. బుధవారం బీఆర్కే భవన్‌లోని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రీజినల్‌ అధికారి వారిని విచారించారు. మొత్తం 9 ఆస్పత్రుల సూపరింటెండెంట్లను విచారణకు పిలిచారు. అందులో డాక్టర్‌ రాకేశ్‌ సహాయ్‌-ఉస్మానియా ఆస్పత్రి; డాక్టర్‌ కె.మల్లికార్జున-నారాయణపేట జిల్లా ఆస్పత్రి; డాక్టర్‌ పావని-మద్దూర్‌, సీహెచ్‌సీ; డాక్టర్‌ కాశీనాథ్‌-నిర్మల్‌ జిల్లా ఆస్పత్రి; డాక్టర్‌ రాహుల్‌ కుమార్‌-బోథ్‌ జిల్లా ఆస్పత్రి; డాక్టర్‌ పి.జగదీశ్వర్‌-ములుగు ఏహెచ్‌; డాక్టర్‌ బి.రమేశ్‌-కల్లూర్‌ సీహెచ్‌సీ; డాక్టర్‌ బి.శ్రీనివాసరావు-మహబూబాబాద్‌ జీజీహెచ్‌ ఉన్నారు. వీరంతా టెండర్లు, ఇండెంట్లలో ఏం జరిగిందన్న వివరాలను విచారణలో అందజేశారు. టీజీఎంఎ్‌సఐడీసీలో 2022-23 నుంచి 2023-24 మధ్య కాలంలో కొనుగోలు చేసిన రిటుక్సిమాబ్‌ ఇంజెక్షన్‌, ప్రీమిక్స్‌ హ్యూమన్‌ ఇన్సులిన్‌ 50/50 మందుల ఇండెంట్‌, వినియోగ వివరాలు, సంబంధిత ఫార్మాసి్‌స్ట/సెక్షన్‌ ఇన్‌చార్జ్‌, డాక్టర్లను కూడా అవసరమైన రికార్డులతో హాజరుపర్చాలని టీజీఎంఎ్‌సఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను విజిలెన్స్‌ అధికారులు కోరారు. ఈ సందర్భంగా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా రిటుక్సిమాబ్‌ ఔషఽధం అంతకుముందు పదేళ్లలో ఒక్కసారి కూడా ఈ ఇంజెక్షన్‌ను కొనుగోలు చేయలేదు. దీన్ని క్యాన్సర్‌ వైద్య నిపుణులు, రుమటాలజిస్టులే సిఫార్సు చేస్తారు. అటువంటిది ఏకంగా 5,800 ఇంజెక్షన్లను సుమారు రూ.3.58 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందులో కేవలం 2 వేల ఇంజక్షన్లనే వినియోగించారు. మిగిలినవన్నీ ఎక్స్‌పైరీ అయ్యాయి. దీని వెనుక టీజీఎంఎ్‌సఐడీసీ అప్పటి ఈడీ, అతడి బృందం హస్తం ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. బుధవారం జరిగిన సూపరింటెండెంట్ల విచారణలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎవరి ఒత్తిడి మేరకు ఇండెంట్‌ పెట్టారు? ఆన్‌లైన్‌లో పెట్టాల్సిన వాటిని మాన్యువల్‌గా ఎందుకు పెట్టారు? అలా పెట్టాలని టీజీఎంఎ్‌సఐడీసీ నుంచి ఎవరు కోరారు? అని ప్రశ్నించికీలక వివరాలను విజిలెన్స్‌ అధికారులు రాబట్టినట్లు తెలిసింది. కొందరు సూపరింటెండెంట్లు టీజీఎంఎ్‌సఐడీసీ అధికారుల ఒత్తిడిమేరకే ఇండెంట్లు పెట్టామనిచెప్పినట్లు సమాచారం. ఒకరిద్దరు మాత్రం క్షేత్రస్థాయి నుంచి వైద్యుల కోరిన విధంగానే ఆర్డర్లు పెట్టామని వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.


సీఎం ఆదేశాలతో రంగంలోకి..

టీజీఎంఎ్‌సఐడీసీలో సుమారు రూ.3,500 కోట్ల విలువైన ఔషధ, వైద్య పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2022 ఏప్రిల్‌ 1 నుండి 2026 మార్చి 31 వరకు జరిగిన టెండర్లు, కొనుగోళ్లపై ప్రస్తుతం విజిలెన్స్‌ సమగ్ర విచారణ జరుపుతోంది. కార్పొరేషన్‌ నుంచి ఇప్పటికే 11 రకాల కీలక రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ కుంభకోణంలో ఎవరి హస్తం ఉందో తేల్చడానికి విజిలెన్స్‌ విభాగం టీజీఎంఎ్‌సఐడీసీ నుంచి అనేక కీలక పత్రాలను, ఫైళ్లను ఇప్పటికే తీసుకుంది. ఆస్పత్రుల నుంచి వచ్చిన ఇండెంట్ల దగ్గరి నుంచి బిల్లుల చెల్లింపుల వరకు ఉన్న లొసుగులను ఒక్కొక్కటి బయటకు తీస్తోంది. సూత్రధారులెవరో తేల్చే పనిలో పడింది..


మారని అధికారుల తీరు..

ఓవైపు విజిలెన్స్‌ విచారణ జరుగుతున్నా టీజీఎంఎ్‌సఐడీసీలోని కొందరు అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఎక్వి్‌పమెంట్‌ టెండరు విషయంలో టెండర్లలో పాల్గొన్న ఏజెన్సీలన్నింటికీ డెమోలో పాల్గొనే అవకాశం కల్పించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నిబంధనల ప్రకారం టెండరు దాఖలు చేసిన తర్వాత టెక్నికల్‌గా క్వాలిఫై అయిన కంపెనీలు, ఏజెన్సీలకే డెమోలో పాల్గొనే అవకాశం కల్పించాల్సి ఉండగా కార్పొరేషన్‌ అధికారులు ఏకపక్షంగా నిబంధనలను మార్చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. ఇదే అంశంపై టీజీఎంఎ్‌సఐడీసీ ఎండీ గౌరవ్‌ ఉప్పల్‌ను వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు

డాక్టర్‌.. ఎస్సెస్సీ..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 04:27 AM