డాక్టర్.. ఎస్సెస్సీ..!
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:25 AM
ఒంటిపై తెల్లకోటు.. చేతిలో స్థెతస్కోప్.. టేబుల్‌పై బీపీ మెషీన్.. పక్కన సిరంజీలు, ముందుల సీసాలు, రకరకాల మాత్రలు.. ఇదంతా ఎవరో ఎంబీబీఎస్ డాక్టర్ హడావుడి కాదు.. పదో తరగతితోనే చదువు ఆపేసి వైద్యుడిలా చలామణీ అవుతున్న ఓ వ్యక్తి వ్యవహారం.
పదో తరగతి చదువుతోనే వైద్యం
గల్లీకో క్లినిక్.. అవసరం లేకున్నా సెలైన్లు, ఇంజెక్షన్లు
జ్వరమొచ్చినా, జలుబు వచ్చినా యాంటీ బయాటిక్స్
కొన్నిచోట్ల అబార్షన్లూ చేస్తున్న వైనం
వైద్యం వికటించి ప్రాణాలకు ముప్పు
పోలీసులు, వైద్యాధికారుల దాడులు
సైబరాబాద్ పరిధిలో పది మంది నకిలీ వైద్యుల అరెస్టు
హైదరాబాద్ సిటీ/ పేట్ బషీరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఒంటిపై తెల్లకోటు.. చేతిలో స్థెతస్కోప్.. టేబుల్‌పై బీపీ మెషీన్.. పక్కన సిరంజీలు, ముందుల సీసాలు, రకరకాల మాత్రలు.. ఇదంతా ఎవరో ఎంబీబీఎస్ డాక్టర్ హడావుడి కాదు.. పదో తరగతితోనే చదువు ఆపేసి వైద్యుడిలా చలామణీ అవుతున్న ఓ వ్యక్తి వ్యవహారం. ఇంకా ఇంటర్ చదివి, ఆస్పత్రుల్లో నర్సుగా, కంపౌండర్‌గా పనిచేసి.. సొంతంగా చిన్నపాటి ఆస్పత్రులు నడిపిస్తున్నవారు ఎందరో.. హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో వీధికొకటి చొప్పున వెలిసిన క్లీనిక్‌లలో చాలా వరకు ఇలాంటివే. ఏదో ఆరోగ్య సమస్యతో వచ్చినవారి వద్ద రూ.100 నుంచి 300 వరకు ఫీజు తీసుకోవడం, జ్వరం గోలీలో, నొప్పి మాత్రలో ఇవ్వడం లేదా అవసరమున్నా లేకున్నా సెలైన్ పెట్టి, నొప్పి నివారణ ఇంజెక్షన్లు, ఇష్టమొచ్చినట్టుగా యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇవ్వడం, గాయాలకు కుట్లు వేయడం పరిపాటిగా మారిపోయింది. ఆరోగ్య సమస్య తగ్గకపోయినా, ఏమైనా తేడా వచ్చినా.. వెంటనే ఏవైనా ఆస్పత్రులకు రిఫర్ చేయడం, వాటి నుంచి కమీషన్ పొందడమూ విచ్చలవిడిగా జరుగుతోంది. కొందరైతే గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలపై అందిన ఫిర్యాదులతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, కుత్బుల్లాపూర్, ఆర్‌సీ పురం జోనల్ బృందాలు, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు రంగంలోకి దిగి.. పది క్లినిక్‌లలో తనిఖీలు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యవృత్తి నిర్వహిస్తున్న పది మంది నకిలీ డాక్టర్లను అరెస్టు చేశారు. వైద్య పరికరాలు, సెలైన్లు, సిరంజీలు, గడువు ముగిసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పేట్‌బషీరాబాద్ పోలీ్‌సస్టేషన్‌లో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
ఎలాంటి వైద్య అర్హత లేకుండానే..
క్లినిక్‌లపై దాడులు చేసిన అధికారులు పది మంది నకిలీ వైద్యులను అరెస్టు చేశారు. అందులో పది చదివిన అంజాగౌడ్ (49) మేడ్చల్ పరిధిలో.. ఇంటర్ చదివిన వి.బుచ్చయ్య (35) జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండలో.. కె.నారాయణ (50) బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్‌లో.. రమావత్ ప్రకాశ్ (26) దేవరయాంజాల్‌లో.. పి.గంగాధర్ (55) ఆర్‌జేపీనగర్‌లో.. బీకాం చదివిన ఎం.సుధాకర్‌చారి (61) ఎన్జీవో కాలనీలో.. బీఏ, బీఈఎంఎస్ చేసిన జి.ప్రహ్లద్ (55) ఆర్‌సీపురం బండ్లగూడలో.. డిగ్రీ చేసిన కోనపల బుచ్చిబాబు (50) ఐడీఏ బొల్లారంలో.. బీ-ఫార్మసీ చేసిన మేకల అక్షయ్ కుమార్ (35) సూరారం ముత్యాలబస్తీలో.. బీఎస్సీ చదివిన ఎస్.శ్రీనివాసరావు (47) పటాన్‌చెరు సైరా కాలనీలో క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ తయారీ
సైబర్ నేరాల కట్టడికి అవగాహన కార్యక్రమాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News