ఎప్పుడూ సమావేశాలే అంటే పనెప్పుడు చెయ్యాలి?
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:59 AM
తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పాలనలో కనిపిస్తున్న చిత్రం ఇదే. సమీక్షలు, సమావేశాలు, వీసీలకే గంటలకొద్దీ సమయం పోతుంటే ఇక పనెప్పుడు చేయాలని ఉద్యోగులు వాపోతున్నారు.
వరుస వీసీలు, భేటీలతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి..
ఒకే విషయంపై.. మంత్రి నుంచి కలెక్టర్ వరకు సమీక్షలు
అడిగిన నివేదికలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని ఆవేదన
ఆదివారాలు కూడా పని చేయాలంటే.. తాము చేయలేమంటున్న ఉద్యోగులు
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉదయం నుంచి సాయంత్రం వరకు వరస సమావేశాలు.. వీడియోకాన్ఫెరెన్స్ (వీసీ)లు.. ఒక సమావేశం ముగిశాక వెంటనే మరో సమావేశం.. అది జరుగుతుండగానే మరో సమావేశానికి నోట్స్ పంపాలంటూ మరో శాఖ నుంచి ఫోన్.. అడిగిన వివరాలే అడగడం.. ఆదివారం.. పండగ రోజుల్లో కూడా కార్యాలయాలకు రావాల్సిందేనంటూ శాఖాధిపతుల ఆదేశాలు జారీచేయడం!... తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పాలనలో కనిపిస్తున్న చిత్రం ఇదే. సమీక్షలు, సమావేశాలు, వీసీలకే గంటలకొద్దీ సమయం పోతుంటే ఇక పనెప్పుడు చేయాలని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగులు, అధికారులు ఇలా సమీక్షలు, సమావేశాల్లో హడావుడిగా ఉండడంతో ఆ ప్రభావం ప్రజలపై పడుతోంది. సామాన్యులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని ఉండి వెళ్తే.. ‘మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. తర్వాత రాపో’ అని సిబ్బంది, అధికారులు వారిని కసురుకుని పంపేస్తున్నారు. ఇలా నెలల తరబడి ప్రజలను తిప్పడమే తప్ప వారిని కలిసి సమస్య వినే ఓపిక.. సమయం అధికారులకు ఉండట్లేదు. దీని వల్ల ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం తప్ప ఉపయోగం ఏమీ లేదని ఉద్యోగ సంఘాల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు అన్నారు. కలెక్టర్లు సాయంత్రం ఐదు గంటల తరువాత సమావేశాలు నిర్వహిస్తున్నారని.. రాత్రి 10 గంటలు దాటినా సమావేశాలు, నివేదికల పేరుతో యంత్రాంగాన్ని కార్యాలయాల్లోనే ఉండేలా చేస్తున్నారని.. నివేదికలు ఇచ్చేవరకూ వదలట్లేదని.. విమర్శలున్నాయి. ఎవరైనా 6 గంటల తరువాత కార్యాలయంలో లేకపోతే.. వెంటనే కలెక్టర్ సీసీ నుంచి.. ‘మీరు ఉన్నచోటు (జియో కో-ఆర్డినేట్స్) పంపండి’ అంటూ ఆదేశాలు వస్తాయని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్నిచోట్ల.. ఉద్యోగులకు ఆదివారం, సెలవురోజు, పండగలనేవి లేకుండా పోతున్నాయి.. ఉదాహరణకు ఖమ్మం జిల్లా నుంచి ప్రభుత్వంలో ముగ్గురు కీలక మంత్రులు ఉన్నారు. వారాంతాల్లో వారంతా ఖమ్మం జిల్లాకు వెళ్తుండడంతో.. అక్కడి అధికారులు సెలవు రోజుల్లోనూ పనిచేయాల్సి వస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జన్మభూమి, ప్రజల వద్దకు పాలన అంటూ నిత్యం నివేదికలు, సమావేశాలు, ఏదో ఒక ఫార్మేట్‌లో రిపోర్టులు సేకరించడమే పనిగా పెట్టుకోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూడా అదే తరహా వాతావరణం ఉందని.. ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. బకాయిలు, డీఏలు చెల్లించకుండా.. సెలవులు సైతం లేకుండా సమీక్షలు, నివేదికల పేరుతో ఉద్యోగులతో చాకిరీ చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కలెక్టర్లతో సమానంగా..
చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఏదో ఒక సమావేశం పేరుతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. అది చాలదన్నట్లు.. ఎమ్మెల్యేలు కూడా గంటల కొద్దీ సమీక్షలు నిర్వహించి, నివేదికలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర స్థాయి నుంచి కార్యదర్శులు, శాఖాధిపతులు నిర్వహించే సమీక్షల్లో.. వారు తమకు చెప్పాల్సిన వివరాల కంటే సోది ఎక్కువ ఉంటుందని కొంత మంది కలెక్టర్లు చెబుతున్నారు. వాస్తవానికి జిల్లాల్లో ఏయే పథకాలు అమలవుతున్నాయి? ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి.. వంటి వివరాలన్నీ రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖల వద్ద అందుబాటులో ఉంటాయి. అయినా ఒకే సమాచారాన్ని వేర్వేరు స్థాయులవారు పదే పదే అడగడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు
ఔషధాల కొనుగోల్‌మాల్‌లో బిగుస్తున్న ఉచ్చు!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News