Share News

పదేళ్ల క్రితమే మెస్సి రిటైర్‌మెంట్.. రొనాల్డో రియాక్షన్ వైరల్!

ABN , Publish Date - Sep 01 , 2026 | 07:57 AM

మెస్సి రిటైర్‌మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 2016 కోపా అమెరికా ఫైనల్‌లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడిన తర్వాత మెస్సి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా అప్పట్లో దీనిపై స్పందించాడు.

పదేళ్ల క్రితమే మెస్సి రిటైర్‌మెంట్.. రొనాల్డో రియాక్షన్ వైరల్!
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకిన సంగతి తెలిసిందే. అయితే మెస్సి రిటైర్‌మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 2016 కోపా అమెరికా ఫైనల్‌లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడిన తర్వాత, అప్పట్లో కేవలం 29 ఏళ్ల వయసులోనే మెస్సి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో మెస్సి పెనాల్టీ మిస్ చేయడం అర్జెంటీనా ఓటమికి కారణాల్లో ఒకటైంది. వరుసగా ఫైనల్స్‌లో పరాజయాలు ఎదురవడంతో తీవ్ర నిరాశకు గురైన మెస్సి.. ఇకపై అర్జెంటీనా తరఫున ఆడబోనని ప్రకటించాడు. అప్పట్లో ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మెస్సికి చిరకాల ప్రత్యర్థి, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా అప్పట్లో దీనిపై స్పందించాడు.


‘మెస్సి చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులు అతడి పరిస్థితిని, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. అతడికి ఓటములు, నిరాశలు అలవాటు లేవు. రెండో స్థానంలో నిలవడాన్ని కూడా అతడు ఇష్టపడడు. పెనాల్టీ మిస్ అయినంత మాత్రాన అతడు చెడ్డ ఆటగాడు అయిపోడు. మెస్సి కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే బాధగా ఉంది. అతడు తిరిగి తన దేశం తరఫున ఆడాలని ఆశిస్తున్నాను. అర్జెంటీనాకు అతడు అవసరం’ అని రొనాల్డో అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత రొనాల్డో ఆశించినట్లుగానే మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అర్జెంటీనా తరఫున ఎన్నో ఘనతలు సాధించాడు. 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లతో పాటు 2022లో ఫిఫా ప్రపంచకప్‌ను కూడా అందుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

దులీప్ ట్రోఫీ 2026లో మహ్మద్ షమీ అరుదైన ఫీట్

Updated Date - Sep 01 , 2026 | 08:30 AM