అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ గుడ్‌బై
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:40 AM
ఎదుగుదల లోపంతో ఏమైపోతాడో? అనుకొన్న వాడు.. తన ఆటతో రెండు దశాబ్దాలపాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. కష్టాలకు ఎదురీదాడు..
అధికారికంగా ప్రకటించిన అర్జెంటీనా స్టార్
జాతీయ జట్టు తరఫున 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్
2 దశాబ్దాలకుపైగా కెరీర్‌లో ఎన్నో ఘనతలు
ఫుట్‌బాల్ ప్రపంచకప్ సాధించిన కెప్టెన్‌గా ఖ్యాతి
ఫిఫా నుంచి ఎనిమిది సార్లు
ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు
యుగానికొక్కడు
ఎదుగుదల లోపంతో ఏమైపోతాడో? అనుకొన్న వాడు.. తన ఆటతో రెండు దశాబ్దాలపాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. కష్టాలకు ఎదురీదాడు.. పట్టుదలతో పోరాడాడు.. ఓర్పుతో నేర్చాడు.. సాకర్ చరిత్రలో మహోన్నత శిఖరంగా నిలిచాడు.
ఓ శకం ముగిసింది!
మెస్సీ మేనియా దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రపంచాన్ని ఊపేసింది. బార్సిలోనా తరఫున మెరుపులు మెరిపించిన మెస్సీ.. 2004లో అర్జెంటీనా అండర్-20 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పుడు అతడి ఆట విశ్లేషకులను ఎంతగానో ఆకట్టుకొంది. 2005లో 18 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి వచ్చిన లియోనెల్.. క్రమంగా జట్టు మూలస్తంభంగా మారాడు. 2006 ప్రపంచక్‌పలో తొలిసారి అర్జెంటీనాకు ప్రాతినిథ్యం వహించాడు. 2009లో జువాన్ రోమన్ రిక్వెల్మీ రిటైర్మెంట్‌తో నెం:10 జెర్సీ మెస్సీకి వచ్చింది. ఇక, 2010 ఫిఫా వరల్డ్‌కప్ అర్జెంటీనా జట్టును మెస్సీ కేంద్రంగా కోచ్ మారడోనా తయారు చేశాడు.
చేదు అనుభవాలు..
జాతీయ జట్టు అర్జెంటీనా తరఫున మాత్రం ఎన్నో చేదు అనుభవాలు. 2007 కోపా కప్‌లో ఓటమి.. 2014 వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి మెస్సీని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. 2015, 2016 కోపా కప్‌లో కూడా పరాజయాలతో.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. తల్లడిల్లిపోయిన లియోనెల్ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు.
శూన్యం నుంచి..
మెస్సీ దూరం కావడంతో ఒక్కసారిగా అర్జెంటీనా జట్టులో శూన్యం ఆవరించింది. తట్టుకోలేక పోయిన ఫ్యాన్స్.. మళ్లీ తిరిగి రావాలని కోరారు. అభిమానుల కోరికను మెస్సీ మన్నించడం అతడి జీవితంలో.. కెరీర్‌లో ఓ మేలి మలుపు. ఎక్కడైతే పోగొట్టుకొన్నారో.. అక్కడే వెతుక్కోమన్నట్టుగా రీఎంట్రీలో మెస్సీ తననుతాను సరికొత్తగా ఆవిష్కరించుకొన్నాడు. 2021లో మరకాన స్టేడియంలో కోపాక్‌పను అతడు ముద్దాడడం ఫుట్‌బాల్ చరిత్రలోనే భావోద్వేగ సందర్భం. అర్జెంటీనాకు ట్రోఫీ అందించడంతో అతడికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

‘ఎడారి’లో దాహం తీరింది..
2022 కతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్.. ఒకరకంగా మెస్సీకి చివరి అవకాశం అని భావించారు. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో ఓటమి. ఇంత గొప్ప ఆటగాడి కెరీర్ వరల్డ్‌క్‌పను అందుకోకుండానే ముగుస్తుందా? అనే నిర్వేదం. కానీ, డీలా పడిన జట్టులో స్ఫూర్తిని రగిల్చిన మెస్సీ.. వరుస విజయాలతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫ్రాన్స్‌తో టైటిల్ ఫైట్‌లో డ్రామా నడిచినా.. షూటౌట్‌లో అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ.. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’గా తనపేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకొన్నాడు. 2024లో మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా మరోసారి కోపా అమెరికా కప్ విజేతగా నిలవగా.. 2026 ప్రపంచక్‌పలో డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను లియోనెల్ మరోసారి ఫైనల్‌కు చేర్చాడు.
కుటుంబం..
మెస్సీ తన చిన్ననాటి స్నేహితురాలు ఆంటోనెలా రొకుజోను కొన్నాళ్ల సహజీవనం అనంతరం 2017 జూలైలో పెళ్లాడాడు. వారికి ముగ్గురు సంతానం. పెద్దకొడుకు థియాగో మెస్సీ 2012లో, రెండో కుమారుడు మాటెయో మెస్సీ 2015లో, మూడో కొడుకు సిరో మెస్సీ 2018లో జన్మించారు. ఇక మెస్సీ తండ్రి జార్జ్ ఈ మధ్యే మృతిచెందారు. మెస్సీకి తల్లి, ఇద్దరు అన్నలు, ఓ చెల్లెలు ఉన్నారు.
హైదరాబాద్‌తో అనుబంధం
భారత పర్యటనలో భాగంగా గత ఏడాది డిసెంబరు 13న మెస్సీ హైదరాబాద్‌కు విచ్చేశాడు. మెస్సీ రాకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అతడికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసి.. ఔరా అనిపించింది. ఫలక్‌నుమా ప్యాలె్‌సలో బస చేసిన మెస్సీ, తొలుత అక్కడ కొద్ది మంది అభిమానులతో ఫొటోలు దిగాడు. అనంతరం ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ కొద్దిసేపు ఆడడం ఈ పర్యటనకే హైలైట్‌గా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు సెలెబ్రెటీలు ఉప్పల్ స్టేడియానికి తరలి వచ్చారు. మ్యాచ్ అనంతరం మెస్సీ స్టేడియం మొత్తం తిరుగుతూ తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశాడు. ఆతర్వాత స్టేడియంలోనే యువ క్రీడాకారులతో కొద్దిసేపు ముచ్చటించి, వారికి కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు.

మీ ఆట.. ప్రపంచానికి ప్రేరణ
సీఎం రేవంత్
మెస్సీ రిటైర్మెంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘మీరు ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను ఉర్రూతలూగించారు.. స్ఫూర్తినిచ్చారు. మీతో కలిసి ఫుట్‌బాల్ మైదానంలో కొన్ని నిమిషాలు గడపడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మీరు లేని ఫుట్‌బాల్ మునుపటిలా ఉండదు. వీడ్కోలు పలికినా.. మీ స్ఫూర్తి మరెందరినో ప్రేరేపిస్తూనే ఉంటుంద’ని రేవంత్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అచ్చం సచిన్‌లాగే!
క్రికెట్ దిగ్గజం సచిన్‌కు, ఫుట్‌బాల్ గ్రేట్ మెస్సీల ప్రపంచకప్ విజయాల్లో కొన్ని పోలికలున్నాయి. సచిన్ పదో నెంబర్ జెర్సీని ధరిస్తే.. మెస్సీది కూడా అదే నెంబర్ జెర్సీ. 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపాలైన సచిన్.. ఎనిమిదేళ్ల తర్వాత 2011లో విశ్వక్‌పను అందుకున్నాడు. అలాగే 2014 ప్రపంచకప్ తుది పోరులో రన్నర్‌పనకు పరిమితమైన మెస్సీ.. సరిగ్గా ఎనిమిదేళ్ల అనంతరం 2022లో విశ్వవిజేతగా నిలిచాడు. ఇలా, వేర్వేరు క్రీడల్లో ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల మధ్య పోలికలుండడం విశేషమే కదా!
కెరీర్ ఘనతలు..
అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్ చేశాడు.
8 సార్లు బాలన్ డీ ఓర్ అవార్డులు.
తన కెప్టెన్సీలో అర్జెంటీనాకు ఓ ప్రపంచ కప్ (2022).
తన సారథ్యంలో రెండు కోపా అమెరికా టైటిళ్లు (2021, 2024).
ఒలింపిక్ క్రీడల (2008 బీజింగ్) స్వర్ణం.
ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ అవార్డు.
అత్యధిక మ్యాచ్‌లకు (133) కెప్టెన్సీ ఘనత.
పది పర్యాయాలు హ్యాట్రిక్ గోల్స్.