Share News

బూతుల వీరుడితో చర్చకు రావాలా?

ABN , Publish Date - Sep 07 , 2026 | 03:20 AM

రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని.. అలాంటి బూతుల వీరుడితో అసెంబ్లీలో చర్చకు రావాలా అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

బూతుల వీరుడితో చర్చకు రావాలా?
KCR

  • పాలన చేతగాకే చిల్లర మాటలు..

  • పదే పదే నా చావు కోరుతూ ప్రసంగాలు

  • ఇది థర్డ్‌ క్లాస్‌ పాలన.. తెలంగాణ రైజింగ్‌ కాదు, ఫాలింగ్‌

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా సభకు వెళ్లండి

  • నా గురించి మాట్లాడితే పట్టించుకోకండి

  • ప్రజాసమస్యలే అజెండాగా ప్రభుత్వాన్ని నిలదీయండి

  • త్వరలో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల బాట

  • ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ లక్ష మందితో పర్యటిస్తా

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌

  • భేటీకి హాజరైన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

హైదరాబాద్‌/గజ్వేల్‌/మర్కుక్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని.. అలాంటి బూతుల వీరుడితో అసెంబ్లీలో చర్చకు రావాలా అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. అసభ్యకరంగా మాట్లాడే వారితో చర్చించేందుకు అసెంబ్లీకి రావాలా, వద్దా? అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడిగారు. పాలన చేతగాకనే సీఎం రేవంత్‌రెడ్డి బూతుపురాణం సాగిస్తున్నారని విమర్శించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని.. శాసనసభ, శాసన మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలని కేసీఆర్‌ సూచించారు. సమావేశాల్లో అధికార పార్టీ నేతలు తన గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే పట్టించుకోవద్దని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు సూచించారు. శాసనసభ, మండలిలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రజల ఎజెండానే బీఆర్‌ఎస్‌ ఎజెండాగా ఉండాలని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ విధానాలను ఎండగట్టాలని.. స్పీకర్‌ పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక విధానాలపై నిలదీయాలని నిర్దేశించారు. కాంగ్రెస్‌ వెయ్యిరోజుల పాలన అట్టర్‌ ఫ్లాప్‌ అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం మళ్లీ రాదని కాంగ్రెస్‌ నేతలకు అర్థమైందని, అందుకే అడ్డగోలుగా దోపిడీకి తెగబడ్డారని ఆరోపించారు.


తెలంగాణలో ఇప్పుడు థర్డ్‌ క్లాస్‌ పాలన!

కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం కోసం దిగజారి మాట్లాడుతున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. పదేపదే తన చావును కోరుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారని.. మరోవైపు తాను అసెంబ్లీకి రావాలంటూ ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో థర్డ్‌ క్లాస్‌ పాలన కొనసాగుతోందని, ఎక్కడా ప్రగతి కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్నది తెలంగాణ రైజింగ్‌ కాదని, తెలంగాణ ఫాలింగ్‌ ప్రత్యక్షంగా కనబడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సర్కారు 22ఏ పేరుతో కుంభకోణానికి తెరలేపిందని కేసీఆర్‌ ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాల అంశంపై ఉధృత పోరాటం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. బీఆర్‌ఎ్‌సపై అక్కసుతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టారని.. ఎల్‌నినో ముసురుకున్న తరుణంలో నీటిని ఎత్తిపోసి నిల్వ చేయాల్సిన ప్రభుత్వం, అసలేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లోకి వెళదామన్నారు. త్వరలోనే లక్ష మందితో కలిసి కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల వద్దకు వెళదామని.. కాంగ్రెస్‌ ప్రభుత్వ కుట్రలను, నీటి పారుదల రంగానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరిద్దామని పార్టీ నేతలతో కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతుందని.. అందుకు అనుగుణంగా పార్టీ నేతలు సిద్ధం కావాల్సి ఉంటుందని సూచించారు. కాగా ఈ భేటీ సందర్భంగా అసెంబ్లీలో లేవనెత్తాల్సిన సుమారు 20 అంశాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొన్న పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి.. ఎర్రవల్లి భేటీలో పాల్గొనడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబరులోగా బొగ్గు ఉత్పత్తి షురూ

శీతల్‌కు టాప్‌ సీడ్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 03:23 AM