Share News

ఫ్యాషన్‌ ప్రపంచంలో అశ్వ సుందరి

ABN , Publish Date - Sep 07 , 2026 | 02:07 AM

సంస్కృతినీ, వారసత్వాన్నీ ప్రతిబింబించే దుస్తుల రూపకల్పనతో ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది మొరాకోకు చెందిన సల్మా తహ్రి. అరేబియన్‌ గుర్రపు స్వారీ, విలు విద్య సంప్రదాయాన్నీ, ఇస్లామిక్‌ వస్త్రధారణనూ రంగరించి, ‘ఫిల్లీ ప్యారిస్‌’ అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌తో మొరాకో సాంస్కృతిక రాయబారిగా మారిపోయిన ఆ అశ్వ సుందరి ప్రస్థానం గురించి తెలుసుకుందాం!

ఫ్యాషన్‌ ప్రపంచంలో అశ్వ సుందరి
salma tehri

సంస్కృతినీ, వారసత్వాన్నీ ప్రతిబింబించే దుస్తుల రూపకల్పనతో ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది మొరాకోకు చెందిన సల్మా తహ్రి. అరేబియన్‌ గుర్రపు స్వారీ, విలు విద్య సంప్రదాయాన్నీ, ఇస్లామిక్‌ వస్త్రధారణనూ రంగరించి, ‘ఫిల్లీ ప్యారిస్‌’ అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌తో మొరాకో సాంస్కృతిక రాయబారిగా మారిపోయిన ఆ అశ్వ సుందరి ప్రస్థానం గురించి తెలుసుకుందాం!


ఫ్రాన్స్‌లో పుట్టిన మొరాకో అమ్మాయిని నేను. ఫ్రాన్స్‌లో ఒక ఫ్రెంచ్‌ అమ్మాయిగా పెరగలేకపోయాను. చిన్నప్పుడే మూలాల పట్ల ఆసక్తి నన్ను తొలిచేయడం మొదలుపెట్టింది. మలేషియా వెళ్లినప్పుడు, అక్కడొక మహిళ గుర్రాన్ని అధిరోహించడం కోసం అవస్థలు పడుతూ ఉండడం గమనించాను. ‘ఆ గుర్రం ఎందుకలా ప్రవర్తిస్తోంది?’ ‘ఆ సందర్భంలో ఆమె చేస్తున్న పొరపాటు ఏంటి?’ అనే ఆసక్తి నన్ను గుర్రాల వైపు నడిపించింది. అరేబియన్‌ గుర్రాలు మొరాకో సంస్కృతిలో ఒక భాగం. నా మూలాలు అక్కడివే కాబట్టి గుర్రపు స్వారీ మీద మక్కువతో ఆ విద్యను ఔపాసన పట్టాలనుకున్నాను. వాటి అందం, ఆకర్షణ, క్రమశిక్షణ, విశ్వాసాలు... అంతకు మించి వాటి ఔన్నత్యం నన్నెంతో ఆకట్టుకున్నాయి. నాన్న ఓ సందర్భంలో నీ గుర్రం మా నాన్న గుర్రంలాగే ఉందని అన్నారు. అప్పటివరకూ మా పూర్వీకులు గుర్రపుస్వారీ చేసేవారని నాకు తెలియదు. తర్వాత నాన్న, మా తాతయ్య ఉపయోగించిన జీనును నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ జీను మీదున్న డిజైన్‌ నన్నెంతో ఆకట్టుకుంది. అలా ముస్లిం మహిళల సంప్రదాయ దుస్తులు, గుర్రపు జీన్‌, గుర్రపుస్వారీ సాధనాల డిజైనింగ్‌ పట్ల ఆసక్తి మొదలైంది.


రాజసానికి నిలువుటద్దంగా...

నా దృష్టిలో దుస్తులు కేవలం అలంకారప్రాయాలు కావు, అవి అనుబంధాన్ని వ్యక్తపరిచే మాధ్యమాలు. మరీ ముఖ్యంగా మొరాకో సంస్కృతితో ముడిపడిన అరేబియన్‌ గుర్రాల మీద స్వారీ చేసేటప్పుడు, వాటి రాజసాన్నీ, ఔన్నత్యాన్నీ ప్రతిబింబించే అద్భుతమైన, సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవాలి. ఆ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఫ్యాషన్‌ బ్రాండ్‌... ఫిల్లీ ప్యారిస్‌. ఒంటి మీద జాలువారే నల్లని అబయ, ఆచితూచి రూపొందించిన నికాబ్‌, పాలిష్‌ చేసిన రైడింగ్‌ బూట్లు, లెదర్‌ గ్లోవ్స్‌, గుర్రపు స్వారీ సాధనాలు... అరేబియా గుర్రం రాజసాన్ని ప్రతిబింబించేలా డిజైన్‌ అయ్యాయి. మొరాకో వస్త్రకళనూ, డిజైన్లనూ ఆధునిక కోణంలో ప్రపంచం ముందు ఆవిష్కరించాలన్నది నా ఉద్దేశం. అందుకోసం సంప్రదాయ ఇస్లాం దుస్తుల్లో గుర్రపు స్వారీ వీడియోలు రూపొందించాను. అవి కూడా నా గుర్రాల్లాగే వేగంగా ప్రపంచమంతా ప్రయాణించడం మొదలుపెట్టాయి. నిజానికి ప్రజలిప్పటివరకూ అలాంటి దృశ్యాలను చూడలేదు. ఆ వీడియోలు ప్రపంచ ప్రఖ్యాత పాప్‌ స్టార్‌ మడోన్నా దృష్టిని ఆకర్షిస్తాయని నేను ఊహించలేకపోయాను.


దుస్తులు అడ్డు కాదు.. కాకూడదు

నా డిజైన్లలో కొత్తదనం కంటే వైరుధ్యం ప్రపంచాన్ని ఎక్కువగా ఆకట్టుకుంది. తల నుంచి పాదాల వరకూ దుస్తులు ధరించిన ఒక యువతి, శక్తివంతమైన గుర్రాన్ని అధిరోహించి విశాలమైన ఇసుక మైదానాల్లో స్వారీ చేయడం ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని ఒక అద్భుతం. అలాంటి యువతిలో ప్రతిఫలించిన ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛలు అందర్నీ ఆకట్టుకున్నాయి. నిజానికి అలాంటి మహిళకూ కలలుంటాయనీ, చేయాలనుకున్నది ఏదైనా చేయగలుగుతుందనీ నేను నా వస్త్రాల ద్వారా చాటిచెప్పాలనుకున్నాను. ప్రధానంగా ముస్లిం మహిళల గురించి అందర్లో కొన్ని అభిప్రాయాలు నాటుకుపోయి ఉంటున్నాయి. అవన్నీ తప్పనీ, ముస్లిం మహిళలకు కూడా ఆశయాలు, కలలు, లక్ష్యాలూ ఉంటాయనీ నిరూపించాలనుకున్నాను. నికాబ్‌ ధరించే మహిళలు వారి కలలనూ, అభిరుచులనూ అనుసరించాలనీ, నచ్చిన పని చేయడానికి దుస్తులెప్పుడూ అడ్డుపడకూడదనీ భావిస్తాను. కాబట్టే నిడా అనే మృదువైన, జాలువారే తత్వం కలిగిన వస్త్రాన్ని దుస్తుల డిజైనింగ్‌ కోసం ఎంచుకున్నాను.


ఓగ్‌ ఫొటో షూట్‌ కోసం...

తాజాగా ఓగ్‌ తన మ్యాగజైన్‌ ఫొటో ఫీచర్‌ కోసం నన్ను సంప్రతించింది. అందుకోసం మొరాకోలోని అయిత్‌ బెన్‌హదో అనే యునెస్కో ప్రపంచ వారసత్వం ప్రదేశాన్ని ఎంచుకున్నాం. గ్లాడియేటర్‌, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్‌ సినిమాల చిత్రీకరణ జరిగిన ప్రదేశమిది. ఈ షూట్‌ కోసం రీసైకిల్‌ చేసిన గుర్రపు జీనును ఉపయోగించాను. ఇస్లామిక్‌ ఆండలూసియన్‌ ఆర్నమెంటేషన్‌ నుంచి పొందిన ప్రేరణతో దీన్ని రూపొందించాను. అందుకు నాకు మూడు వారాల సమయం పట్టింది. సంక్లిష్టమైన జామెట్రీ ఆకృతులు, చేత్తో తీర్చిదిద్దిన బంగారు ఆభరణాల డిజైన్‌, మొరాకో వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మొరాకో మూలాలున్న నేను ఆ సంస్కృతినీ, వారసత్వాన్నీ దుస్తుల డిజైనింగ్‌ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పగలిగినందుకు ఎంతో గర్వపడుతున్నాను.


ఒక రోజు ప్రపంచ ప్రఖ్యాత పాక్‌ గాయని, మడోన్నా నుంచి నేనొక మెసేజ్‌ అందుకున్నాను. నాతో కలిసి గుర్రపు స్వారీ చేయాలని ఉన్నట్టు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్‌ మెసేజ్‌ చేశారు. అది చదివి షాక్‌ అయ్యాను. ఫేక్‌ అకౌంట్‌ అయి ఉంటుందని అనుకున్నాను. కానీ ఆ తర్వాత మడోన్నా స్వయంగా ఆ మెసేజ్‌ చేసినట్టు తెలిసి ఎంతో సంతోషించి, ఆమెను మొరాకోకు ఆహ్వానించాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి అరేబియా గుర్రాల మీద స్వారీ చేశాం. ఆ అనుభవాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను.


ఈ వార్తలు కూడా చదవండి..

పారా అథ్లెట్‌... ట్రాక్‌లో హిట్‌

మైక్రో డోసింగ్‌ సెల్ఫ్‌కేర్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 02:07 AM