పారా అథ్లెట్... ట్రాక్‌లో హిట్
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:09 AM
లెక్కకు మించి శస్త్రచికిత్సలు... కృత్రిమ కాలు... అడుగడుగునా అవరోధాలు. కానీ సంకల్ప బలంతో అన్నిటినీ అధిగమించి పారా అథ్లెట్‌గా పతకాల పంట పండిస్తోంది శశ్రుతి నకాడే.
పుట్టుకతోనే వైకల్యం... బాల్యమంతా ఆసుపత్రుల చుట్టూ తిరగడంతోనే సరిపోయింది. లెక్కకు మించి శస్త్రచికిత్సలు... కృత్రిమ కాలు... అడుగడుగునా అవరోధాలు. కానీ సంకల్ప బలంతో అన్నిటినీ అధిగమించి పారా అథ్లెట్‌గా పతకాల పంట పండిస్తోంది శశ్రుతి నకాడే. త్రుటిలో ప్యారిస్ పారాలింపిక్స్‌కు బెర్త్ మిస్సయిన ఆమె... 2028 లాస్‌ఏంజిల్స్ గేమ్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా శ్రమిస్తోంది
‘‘అది 2014. అప్పుడు నాకు పదేళ్లు. నాకు చివరి సర్జరీ జరిగిన సంవత్సరం. జైపూర్ లెగ్ స్థానంలో ఆధునిక ఒటోబాక్ కృత్రిమ కాలును వైద్యులు అమర్చారు. అది నా జీవితాన్నే మార్చేసింది. పారా అథ్లెట్‌గా ఆత్మవిశ్వాసంతో కూడిన కొత్త ప్రయాణం ప్రారంభించడానికి నాంది అయింది. మహారాష్ట్రలోని ఆరెంజ్ సిటీగా పేరుపొందిన నాగ్‌పూర్ మాది. నేను కుడి కాలు పిక్క ఎముక (ఫైబులా) లేకుండా పుట్టాను. దాంతో మోకాలి కింది భాగం తీసేయాల్సివచ్చింది. అంతేకాదు... కుడి చేతిలో కూడా లోపం ఉంది. సరిగ్గా పట్టు దొరకదు. సర్జరీకి ముందు నాకు ఈత నేర్పించాలని మా అమ్మానాన్న అనుకున్నారు. దానివల్ల నా శరీరం దృఢంగా మారుతుందనేది వారి ఆలోచన. స్విమ్మింగ్ పూల్‌కు వెళితే ‘మేం వికలాంగులకు నేర్పించలేమ’ని కోచ్‌లు చెప్పడంతో చాలా బాధపడ్డాను. ఆ బాధ ఎలాగైన ఈత నేర్చుకోవాలనే కసిని పెంచింది. చివరకు ఇంటి దగ్గరున్న ఒక స్విమ్మింగ్ పూల్‌లో కోచ్‌లు నాకు శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అలా ఈత మొదలు పెట్టాను. కాలుకు సర్జరీ తరువాత మరింత సౌకర్యంగా అనిపించింది. ఆధునిక కృత్రిమ కాలుతో చురుగ్గా మారాను.
జాతీయ స్థాయిలో...
అమ్మానాన్నలు చెప్పిన మీదట సరదాగా ఈత నేర్చుకోవాలని అనుకున్నాను. ఎప్పుడైతే కొందరు కోచ్‌లు నన్ను తిరస్కరించారో అప్పటి నుంచి ఆ సరదా పట్టుదలగా మారింది. కానీ ఒక్కసారి కొలనులోకి దిగాక నా ఆలోచన మారిపోయింది. నాలాంటివారికి కూడా ప్రత్యేక పోటీలు ఉంటాయని తెలిసింది. అప్పటి నుంచీ ప్రొఫెషనల్ స్విమ్మర్ అవ్వాలని కృషి మొదలుపెట్టాను. సరిగ్గా ఏడాది తరువాత జాతీయ స్థాయి ఈత పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పటివరకు నాలుగు స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నాను. ఆ మరుసటి ఏడాది జరిగిన జూనియర్ ఇండియా క్యాంపులో ప్రముఖ కోచ్ ప్రశాంత్ కర్మాకర్‌ను కలిశాను. అది నా గతిని మార్చేసింది. ఆయన శిక్షణలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకున్నాను.
ఈతకే పరిమితం కాలేదు...
పారా స్విమ్మర్‌గా పది జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. వ్యక్తిగత విభాగంలో టైటిల్ సైతం గెలుచుకున్నాను. కేవలం ఈతకు మాత్రమే పరిమితమైన నాకు ట్రయథ్లాన్ శిక్షణ తీసుకోమని కోచ్ సూచించారు. ఆయన సలహాతో 2021లోనే ట్రయథ్లాన్‌కు మారాను. కానీ రెండేళ్ల తరువాత జరిగిన పారా ఆసియా క్రీడల్లో స్విమ్మింగ్‌లోనే పోటీపడ్డాను. ఆ తరువాత నుంచి ట్రయథ్లాన్‌పైనే దృష్టి పెట్టాను. పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించే లక్ష్యంతో తీవ్రంగా శ్రమించాను. 2024లో మూడు అంతర్జాతీయ చాంపియన్‌షి్‌పల్లో విజయాలు సాధించాను. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్10కు చేరాను కానీ, ఆ ఏడాది పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాను. అర్హత పోటీల్లో నా నడుము కింది భాగంలో విపరీతమైన నొప్పి మొదలైంది. దాంతో సరిగ్గా పరుగెత్తలేకపోయాను. పారా ట్రయథ్లాన్‌లో 750 మీటర్ల స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైక్లింగ్, 5 కిలోమీటర్ల రన్నింగ్ ఉంటాయి. మొదటి రెండింటిలో రాణించినా ఆఖరి ఘట్టంలో సరైన ఫిట్‌నెస్ లేక వెనుదిరగాల్సివచ్చింది. ఇది నన్ను ఎంతో బాధించింది.
ఆ సాహసం చేసింది నేనే...
నా మానసిక స్థితిని అర్థం చేసుకున్న కోచ్... నేను ఒత్తిడిలోకి వెళ్లిపోకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఒక భిన్నమైన పరీక్ష ప్రతిపాదించారు. అదే పాక్ జలసంధిని ఈదడం. మొదట ఆశ్చర్యపోయినా తరువాత ఆ సవాలును స్వీకరించాను. గత ఏడాది ఏప్రిల్ మాసంలో శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత్‌లోని ధనుష్కోడి వరకు 35 కిలోమీటర్లు విస్తరించివున్న పాక్ జలసంధిని ఈదాను. ఈ ఘనత సాధించిన తొలి భారత అంగవైకల్యంగల స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించాను. దీన్ని పూర్తి చేయడానికి 11.05 గంటలు పట్టింది. చివరి రెండు గంటలూ నాకు అగ్నిపరీక్షలా అనిపించింది. తీరం కనిపిస్తుంది. కానీ ఎంత ఈదినా చేరువకావడంలేదు. దాంతో నిస్పృహకు లోనయ్యాను. పడవలో నాకు తోడుగా వస్తున్నవారిని ఎప్పుడు అడిగినా ‘ఇంకా పావుగంటే’ అనేవారు. అది మరింత చికాకు తెప్పించేది. ఎలాగో చివరకు శక్తినంతా కూడగట్టుకొని తీరం చేరుకున్నాను.
ప్రపంచ తొమ్మిదో ర్యాంకు...
పాక్ జలసంధిని ఈదడం నాకు ఉత్తేజాన్ని ఇచ్చింది. నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. దాంతో ఈత మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో ట్రయథ్లాన్ మీద దృష్టి పెట్టాను. ఈ ఏడాది ఆరంభంలో ఉబెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన ప్రపంచ పారా ట్రయథ్లాన్ కప్‌లో కాంస్య పతకం గెలిచాను. అనంతరం పుణెలో నిర్వహించిన పారాట్రైనేషనల్ టైటిల్ దక్కించుకున్నాను. జర్మనీలో జరిగిన ప్రపంచ ట్రయథ్లాన్ చాంపియన్‌షి్‌ప సిరీస్, హంగేరీలో జరిగిన ప్రపంచ కప్‌లో పాల్గొన్నాను. నా ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకోవడానికి అవి తోడ్పడ్డాయి. ప్రస్తుతం ప్రపంచ 9వ ర్యాంకులో కొనసాగుతున్నాను. ఈ నెలాఖరున స్పెయిన్‌లో నిర్వహించే ప్రపంచ ట్రయథ్లాన్ పారా చాంపియన్‌షి్‌పకు సన్నద్ధమవుతున్నాను.’’
అదే లక్ష్యం...
రోజూ ఉదయం ఐదు గంటలకు పరుగుతో నా రోజు మొదలవుతుంది. తరువాత కాసేపు వ్యాయామాలు ఉంటాయి. పదకొండు గంటటలకు సైక్లింగ్ సెషన్. సాయంత్రం 5 నుంచి రెండున్నర గంటలపాటు ఈత. నా శారీక పరిస్థితులకు ఈ మూడు పోటీలూ అత్యంత క్లిష్టమైనవి. అయినా పట్టుదలతో ప్రయత్నిస్తున్నాను. వ్యక్తిగతంగా నాకు ఈత చాలా ఇష్టం. ప్రస్తుతం నా ముందున్న ప్రధాన లక్ష్యాలు... 2028లో జరిగే లాస్‌ఏంజిల్స్ పారాలింపిక్స్‌కు, రాబోయే ప్రపంచ చాంపియన్‌షిప్‌లకు అర్హత సాధించడం, ర్యాంకింగ్స్‌లో కనీసం మూడు స్థానాలు ఎగబాకడం. దీని కోసం కఠోరంగా శ్రమిస్తున్నాను. అన్నిటికీ మించి ఈ ప్రయాణంలో నాకు అండగా ఉన్న మా అమ్మ సహకారం, ప్రోత్సాహం వెలకట్టలేనివి. నా కోసం తను పాటియాలా ఎన్‌ఐఎస్‌లో మసాజ్ థెరపీ కోర్సు చేసింది. నేను ఎక్కడికి వెళ్లినా నా వెన్నంటే ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News