Share News

ఆశయానికి ఆకాశమే హద్దు

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:25 AM

భారత రక్షణ దళాల సుదీర్ఘ చరిత్రలో అపూర్వ అధ్యాయం ఆవిష్కృతమైంది. నాన్‌ మెడికల్‌ విభాగం నుంచి ‘ఎయిర్‌ వైస్‌ మార్షల్‌’ హోదా సాధించిన తొలి మహిళా అధికారిగా శక్తిశర్మ...

ఆశయానికి ఆకాశమే హద్దు

న్యూస్‌మేకర్‌

భారత రక్షణ దళాల సుదీర్ఘ చరిత్రలో అపూర్వ అధ్యాయం ఆవిష్కృతమైంది. నాన్‌ మెడికల్‌ విభాగం నుంచి ‘ఎయిర్‌ వైస్‌ మార్షల్‌’ హోదా సాధించిన తొలి మహిళా అధికారిగా శక్తిశర్మ సరికొత్త రికార్డు సృష్టించారు. సెప్టెంబర్‌ 1న ఎయిర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ‘అసిస్టెంట్‌ చీఫ్‌ ఆఫ్‌ ది ఎయిర్‌ స్టాఫ్‌’ (ఎడ్యుకేషన్‌)గా బాధ్యతలు స్వీకరించిన ఆమె విజయగాధ ఆమె మాటల్లోనే...

‘‘18 జూన్‌ 1994... నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లో ఒక యంగ్‌ ఆఫీసర్‌గా అడుగుపెట్టినప్పుడు నా మనసులో ఒకే ఒక్క ఆలోచన ఉంది, అది.. మాతృభూమికి నిస్వార్థంగా సేవ చేయాలని. అప్పట్లో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో మెడికల్‌ విభాగానికి బయటి మహిళలకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఒకవైపు కఠినమైన సైనిక శిక్షణ, మరోవైపు పురుషాధిక్య వాతావరణంలో మనమేంటో నిరూపించుకోవాల్సిన సవాలు. కానీ నేను ఏనాడూ ఆందోళన చెందలేదు. శ్రమను, విధిపట్ల అంకితభావాన్ని నమ్ముకున్నాను. ఆర్మీ యూనిఫామ్‌ ధరించిన ప్రతి క్షణం నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని, బాధ్యతను నింపేది.

వైవిధ్య అనుభవం

32 ఏళ్లకుపైగా సుదీర్ఘ ప్రయాణంలో వైమానిక దళంలో అనేక పాత్రలు పోషించే అరుదైన అవకాశం నాకు లభించింది. రక్షణ దళాల్లో ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ అనేది కేవలం తరగతి గది పాఠాలకు పరిమితమైనది కాదు. దళాల మేధో సంపత్తిని పెంచడం, ఆధునిక సాంకేతికతకు తగినట్టు శిక్షణ విధానాలను తీర్చిదిద్దడం మా ప్రధాన బాధ్యత. నా సేవా కాలంలో ట్రైనింగ్‌ సెంటర్లు, సరిహద్దుల్లోని ఫీల్డ్‌ స్టేషన్లు, వివిధ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌తోపాటు ఢిల్లీలోని ఎయిర్‌ హెడ్‌క్వార్టర్స్‌లలో విభిన్న బాధ్యతలు నిర్వర్తించాను. ఈ వైవిధ్యమైన అనుభవమే నన్ను పరిపూర్ణమైన మిలటరీ లీడర్‌గా తీర్చిదిద్దింది.

సరిహద్దులను దాటుకుంటూ...

నా కెరీర్‌లో కేవలం విధులను నిర్వర్తించడమే కాకుండా, కొన్ని చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టడం ఎంతో తృప్తినిచ్చింది. త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) చరిత్రలోనే ఒక ప్రసిద్ధ సైనిక్‌ స్కూల్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌ (ప్రిన్సిపాల్‌)గా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా అధికారిని నేనే కావడం నా అదృష్టం. పంజాబ్‌లోని కపుర్తలా సైనిక్‌ స్కూల్‌ బాధ్యలు నిర్వర్తించిన రోజుల్లో.. దేశ భవిష్యత్తు రక్షకులుగా మారబోయే వందలాదిమంది విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను నూరిపోశాను. రక్షణ రంగానికి, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలకు మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు కృషి చేశాను. ఐఐటీ కాన్పూర్‌, పూణె యూనివర్సిటీలలో ‘ఐఏఎఫ్‌ చైర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాను. దీనివల్ల రక్షణ రంగానికి అవసరమైన వ్యూహాత్మక పరిశోధనలు, సాంకేతిక అధ్యయనాలు సులువయ్యాయి. ఇక, వైమానిక దళంలో మెడికల్‌ విభాగం బయట ‘గ్రూప్‌ కెప్టెన్‌’ హోదా సాధించిన తొలి మహిళగా నిలవడం కూడా నా ప్రయాణంలో మరొక మైలురాయి.


6-navya.jpg

వికసించిన ఆశలు

నేను 1994లో ఉద్యోగంలో చేరిన నాటి పరిస్థితులకు, నేటి వాతావరణానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ రోజుల్లో మహిళలకు ప్రమోషన్లు, సుదీర్ఘ సేవా అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ 2010లో భారత వైమానిక దళం మహిళా అధికారులకు ‘పర్మనెంట్‌ కమిషన్‌’ మంజూరు చేయడంతో సంస్కరణల శకం మొదలైంది. దానివల్ల సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం, ఉన్నత స్థానాలకు ఎదిగేబాట సుగమమైంది. నేడు మన మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు, సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోతున్నారు. 1994లో మొదలైన నా 32 ఏళ్ల సుదీర్ఘ పోరాటం నేడు ‘టు స్టార్‌’ ర్యాంకుతో ఫలించిందంటే.. వ్యవస్థల్లో మార్పు తథ్యమనే నమ్మకం నాకు మరింత పెరిగింది.

ఆకాశాన్ని తాకే ఆశయంతో...

‘మూడు దశాబ్దాలకు పైగా నిస్వార్థ సేవలు అందించిన ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ శక్తిశర్మ.. ఐఏఎఫ్‌ లక్ష్య నినాదమైన ‘టచ్‌ స్కై విత్‌ గ్లోరీ’కి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు’ అని నా ఈ విజయంపై రక్షణ మంత్రిత్వశాఖ అభినందించడం ఎంతో గర్వంగా అనిపించింది. ప్రస్తుతం ఎయిర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ‘అసిస్టెంట్‌ చీఫ్‌ ఆఫ్‌ ది ఎయిర్‌ స్టాఫ్‌’ (ఎడ్యుకేషన్‌)గా బాధ్యతలు చేపట్టాను. మన వైమానిక దళాన్ని విద్య, పరిశోధన రంగాల్లో మరింత బలోపేతం చేయడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. ఏ రంగంలోనైనా ప్రతిభకు, శ్రమకు లింగభేదం అడ్డుకాదని నా ప్రయాణం నిరూపించింది. ప్రయత్నిస్తే మహిళలకు ఆకాశమే హద్దు!’’

వైద్యేతర రంగాల్లో మార్పు

భారత సాయుధ దళాల్లో మహిళలు టు స్టార్‌ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంకులకు చేరుకోవడం గతంలోనూ ఉంది. అయితే, వారంతా మిలటరీ మెడికల్‌ సర్వీసెస్‌ (వైద్య విభాగం)కు చెందినవారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ అన్నింటిలో కలిపి నాన్‌ మెడికల్‌ విభాగం (ఎడ్యుకేషన్‌, అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌ మొదలైనవి) నుంచి ఒక మహిళా అధికారి ‘ఎయిర్‌ వైస్‌ మార్షల్‌’ (టు స్టార్‌ ర్యాంక్‌) స్థాయికి ఎదగడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ గెలుపు నాది మాత్రమే కాదు. రక్షణ దళాల్లో మహిళల సాధికారత ఎంత గొప్పగా ఎదుగుతోందో చాటిచెప్పే బలమైన సంకేతం.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:25 AM