Share News

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

ABN , Publish Date - Sep 01 , 2026 | 09:50 PM

ఆస్ట్రియాలోని వియన్నా మ్యూజియంలో పట్టపగలు భారీ దోపిడీ జరిగింది. ఈజిప్టు మాజీ రాణి నజ్లీకి చెందిన, సుమారు 4.3 మిలియన్ డాలర్ల (రూ.38 కోట్లకు పైగా) విలువైన వజ్రాల హారాన్ని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు.

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..
Vienna museum diamond necklace theft

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రియాలోని వియన్నా మ్యూజియంలో పట్టపగలు భారీ దోపిడీ జరిగింది. ఈజిప్టు మాజీ రాణి నజ్లీకి చెందిన, సుమారు 4.3 మిలియన్ డాలర్ల (రూ.38 కోట్లకు పైగా) విలువైన వజ్రాల హారాన్ని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. వియన్నాలోని మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో ఆగస్టు 27న ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు సాధారణ సందర్శకుల మాదిరిగానే మ్యూజియంలోకి ప్రవేశించారు. ఇద్దరూ టికెట్లు కొనుగోలు చేసి వజ్రాల ఆభరణాల ప్రదర్శన జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు (Vienna museum diamond necklace theft).


ఆ దుండగులు ఇద్దరూ మాస్కులు ధరించలేదు. దీంతో మ్యూజియంలోని సీసీటీవీ కెమెరాల్లో వారి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రదర్శనలో ఉన్న హారం వద్దకు చేరుకున్న తర్వాత ఓ వ్యక్తి సుత్తితో గాజు డిస్‌ప్లే కేసును పగులగొట్టాడు. అనంతరం హారాన్ని తీసుకుని ఇద్దరూ కాలినడకన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక అనుమానితుడి వద్ద తుపాకీ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు ($4 million diamond necklace).


చోరీకి గురైనది సాధారణ ఆభరణం కాదు. ఇది ప్లాటినంతో తయారైన ఆర్ట్ డెకో శైలి నెక్లెస్. ఇందులో మొత్తం 673 వజ్రాలు, 200 క్యారెట్లకు పైగా బరువైన రత్నాలు ఉన్నాయి. ఈ హారాన్ని ఈజిప్టు రాణి నజ్లీ కోసం ఫ్రెంచ్ లగ్జరీ జువెలరీ సంస్థ 'వాన్ క్లీఫ్ అండ్ అర్పెల్స్' 1930ల చివర్లో రూపొందించింది. హారం మధ్య భాగంలో పెద్ద వజ్రంతో పాటు బాగెట్-కట్, బ్రిలియంట్-కట్ వజ్రాలను సూర్యకిరణాల ఆకృతిలో అమర్చారు (Vienna museum heist).


చోరీ తర్వాత ఆస్ట్రియా పోలీసులు ఇద్దరు అనుమానితుల కోసం భారీ గాలింపు చేపట్టారు. ట్రాకర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు. మ్యూజియం, సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా హారం కోసం గాలింపు కొనసాగుతోంది. ఇటీవల ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లోనూ విలువైన కళాఖండాలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి.


ఇవి కూడా చదవండి..

ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ కోర్టు భారీ ఊరట.. ఇక ఏకాంత నిర్బంధం ఉండదు..


విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా..

Updated Date - Sep 01 , 2026 | 09:50 PM