అప్‌డేట్ అయితేనే చెప్పగలం
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:55 AM
మహిళలకు ఉపాధ్యాయ వృత్తి ఎంతో ప్రత్యేకమైందని మా అమ్మానాన్న చిన్నప్పటి నుంచీ చెప్పేవారు. వారిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండేవారు. వారి సూచన, సలహా మేరకు నేను విద్యా రంగంలోనే కెరీర్‌ను ఎంచుకున్నాను.
‘విద్యార్ధుల్లో ఉన్న ప్రతిభ, కళాత్మకతను గుర్తించి... తదనుగుణంగా బోధిస్తే వారి నుంచి ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది’ అంటారు ప్రొఫెసర్ ఎం.సీతారామలక్ష్మి. ‘మారుతున్న పరిస్థితుల్లో విద్యార్ధులకు పాఠాలు చెప్పాలంటే ఉపాధ్యాయులు అందుకు తగ్గట్లుగా సన్నద్ధం కావాల్సిందేనని’ ఘంటాపథంగా చెబుతున్న ఆమెను తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ జేఎన్‌ఏఎఫ్ఏ యూనివర్సిటీలో డైరెక్టర్ అడ్మిషన్స్, ఫైన్‌ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్న సీతారామలక్ష్మిని ‘నవ్య’ పలుకరించింది.
‘‘మహిళలకు ఉపాధ్యాయ వృత్తి ఎంతో ప్రత్యేకమైందని మా అమ్మానాన్న చిన్నప్పటి నుంచీ చెప్పేవారు. వారిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండేవారు. వారి సూచన, సలహా మేరకు నేను విద్యా రంగంలోనే కెరీర్‌ను ఎంచుకున్నాను. విద్యా బోధన అనేది విద్యార్ధులు అందరికీ ఒకేలా కాకుండా... వారి వారి ప్రతిభ, కళాభిరుచి, ఆసక్తిని గుర్తించి చెప్పాలి. దానివల్ల వారి నుంచి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే చదువులో వెనుకబడ్డ విద్యార్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారికి అర్ధమయ్యేలా చెప్పాలి. నేను ఇదే విధానం అనుసరిస్తాను. అందువల్లే మిగతా వారికి భిన్నంగా ఈ వృత్తిలో రాణించగలుగుతున్నాను.
వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
వేగంగా మారుతున్న విద్యా విధానంలో మెరుగైన బోధన అందించాలంటే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు తమను తాము అప్‌డేట్ చేసుకోవాలి. అప్పుడే విద్యార్ధులకు అర్థమయ్యేలా బోధించి, వారి నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. యాజమాన్యాలు, ప్రభుత్వం కూడా... ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
బాధ్యత పెరిగింది...
ప్రస్తుతం ఇతర రంగాలతోపాటు బోధన రంగంవైపు వస్తున్నవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం ప్రకటించిన అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది. యూనివర్సిటీ, విద్యార్ధులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది నాకు ప్రేరణనిస్తుంది.’’
ఫైన్‌ఆర్స్‌లో మంచి అవకాశాలు
ప్రస్తుతం ఫైన్‌ఆర్ట్స్ విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఏఐ సబ్జెక్టుల్ని అన్ని విభాగాల్లో ప్రోత్సహిస్తోంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. జేఎన్‌ఏఎ్‌ఫఏలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల వారు, విదేశీ విద్యార్ధులు కూడా ఉంటారు.