Share News

జయశంకర్ ఆశయ సాధనే బీఆర్ఎస్ లక్ష్యం: కేసీఆర్

ABN , Publish Date - Jun 21 , 2026 | 06:56 AM

ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘన నివాళి అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని ధారపోశారని, ఈ సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుందామని పేర్కొన్నారు.

జయశంకర్ ఆశయ సాధనే బీఆర్ఎస్ లక్ష్యం: కేసీఆర్
KCR

హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) ఘన నివాళి అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని దారపోశారని, ఈ సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుందామని పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. బాల్యం నుంచే తెలంగాణ అస్తిత్వం కోసం, సామాజిక రాజకీయ చైతన్యంతో ఆలోచన చేస్తూ, అందుకు తగ్గ భావజాల వ్యాప్తిని కొనసాగించిన నిస్వార్థ మేధావి, తెలంగాణ స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని తాను ముందుకు తీసుకుపోయే క్రమంలో తన ఆలోచనలకు జయశంకర్ దిక్సూచిగా నిలిచారని తెలిపారు.


జయశంకర్ నాకు సైద్ధాంతిక మార్గదర్శిగా నిలిచారు..

రాష్ట్ర సాధన పోరాటంలో జయశంకర్ తనకు సైద్ధాంతిక మార్గదర్శిగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రాజ్యాంగబద్ధంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథా ద్వారా మాత్రమే సాధ్యమనే విశ్వాసంతో నిర్దిష్ట పరిస్థితులకు అనుసరించి సాగిన తన కార్యాచరణకు ఆయన భేషరతుగా మద్దతునిచ్చారని చెప్పుకొచ్చారు. జయశంకర్ స్ఫూర్తి, ఎంతో ఉన్నతమైనదని., క్రియాశీలమైనదని తెలిపారు. నాటి పదేళ్ల బీఆర్ఎస్ పాలన, సబ్బండ కులాల సంక్షేమం అభివృద్ధి కోసం కృషిచేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపామని కొనియాడారు. జయశంకర్ ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా తన పాలన కొనసాగిందని అన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని పదేపదే జయశంకర్ నినదించించారని చెప్పుకొచ్చారు.


జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి..

జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా, ఎంతటి త్యాగాలకైనా ఓర్చి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ కంకణబద్ధమై ఉందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. గడచిన రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో, ఆయన ఆశయాలు గాడి తప్పుతున్నాయని, ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఉద్యమ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని, ఆస్తిత్వ పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. తెలంగాణ గరిమను, సామాజిక రాజకీయ అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకోవడమే, ప్రొఫెసర్ జయశంకర్‌కి మనం ఇచ్చే ఘన నివాళి అని కేసీఆర్ పునరుద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 07:20 AM