Share News

నందిని సిధారెడ్డి.. తెలంగాణ గర్వించదగ్గ కవి: కేసీఆర్

ABN , Publish Date - Mar 16 , 2026 | 05:53 PM

ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డికు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డిని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

నందిని సిధారెడ్డి.. తెలంగాణ గర్వించదగ్గ కవి: కేసీఆర్
KCR

హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డికు (Nandini Sidhareddy) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డిని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నందిని సిధారెడ్డి దీర్ఘ కవితా సంపుటి ‘అనిమేష’, కరోనా సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్ఛిన్నతలను హృద్యంగా చిత్రీకరించడం ద్వారా ఈ అవార్డు పొందడం గొప్ప విషయయని తెలిపారు.


తెలంగాణకు గర్వకారణం..

ఈ సందర్భంగా నందిని సిధారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవి నందిని సిధారెడ్డి అని పేర్కొన్నారు. తన సాహిత్యం తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిందని, తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. నందిని సిధారెడ్డి తెలంగాణ గర్వించదగ్గ కవి మాత్రమే కాక, మానవ సంబంధాలు, సామాజిక సమస్యలు, ప్రజల జీవిత అనుభవాలను సృజనాత్మకంగా చిత్రించే ప్రతిభావంతమైన రచయిత అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.


మంజీరా రచయితల సంఘం..

మెదక్ జిల్లాకు కేంద్రంగా ఏర్పాటైన మంజీరా రచయితల సంఘం ద్వారా నందిని సిధారెడ్డి అన్నివర్గాల ప్రజల సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేశారని కేసీఆర్ తెలిపారు. తన కలను, భావాలను కవిత్వ రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చారని అన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు ఆలోచనాత్మక మార్గదర్శకత్వం ఇచ్చే ప్రయత్నంగా, సామాజిక చైతన్యాన్ని పెంపొందించే విధంగా ఉందని కేసీఆర్ తెలిపారు.


ఉద్యమ కవిగా తెలంగాణ సాధనలో ప్రతిభ..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నందిని సిధారెడ్డి పాటలు, కవిత్వం ద్వారా ప్రజలను ఆలోచింపజేసి, ఉద్యమ కవిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. కవిత్వం, సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యానికి ప్రేరణ కలిగించారని అన్నారు. ప్రజల జీవితాల అనుభవాలను అక్షరబద్ధం చేయడం వంటి అంశాలను కేసీఆర్ ప్రత్యేకంగా హైలైట్ చేశారు.


కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..

భారతీయ సాహిత్య ప్రపంచంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అత్యున్నతమైనదని కేసీఆర్ తెలిపారు. ప్రతి సంవత్సరం భారతీయ భాషల్లో ప్రసిద్ధ రచయితలకు, వారి సాహిత్య కృషికి ప్రతిఫలంగా ఈ అవార్డు ఇస్తారని చెప్పుకొచ్చారు. నందిని సిధారెడ్డి ‘అనిమేష’ ద్వారా సాహిత్య రంగంలో చేసిన విశిష్టమైన కృషికి ఈ అవార్డు పొందడం తెలంగాణ సాహిత్య ప్రపంచానికి గొప్ప ఘనత అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 07:11 PM