జూన్‌కు అన్నారం, సుందిళ్ల..
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:06 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను రెండు విడతల్లో పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
2028 జూన్ కల్లా మేడిగడ్డ బ్యారేజీ కూడా సిద్ధం
రెండు విడతలుగా ‘కాళేశ్వరం’ పునరుద్ధరణ పనులు!
డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిన వెంటనే ప్రారంభం
కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను రెండు విడతల్లో పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తొలి విడతలో 2027 జూన్ కలా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు/పునరుద్ధరణ పనులు చేపట్టి, రెండో విడతలో 2028 జూన్‌లోపు మేడిగడ్డ పునరుద్ధరణ/మరమ్మతులు చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స-పుణె) ఈనెల 25వ తేదీ కల్లా 2డీ నమూనా అధ్యయనం పూర్తి చేస్తే, ఈనెల 30వ తేదీ నాటికి కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నుంచి డిజైన్లకు ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. దానికంటే ముందుగా ఈనెల 20కల్లా పునరుద్ధరణకు క్యాబినెట్ ఆమోదం తీసుకొని, పాత ఏజెన్సీ(నిర్మాణ సంస్థ)లకే పనులు అప్పగించి, మూడు బ్యారేజీల వద్ద క్యాంపుల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అనుకుంటున్నారు. తాజా అంచనాల ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులకు రూ.1833 కోట్లు (ఇందులో పన్నులు రూ.423 కోట్లు) వ్యయం కానుంది. అలాగే, అన్నారం బ్యారేజీ పునరుద్ధరణకు రూ.1210 కోట్లు (ఇందులో పన్నులు రూ.270 కోట్లు), సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులకు రూ.1150 కోట్లు( ఇందులో పన్నులు రూ.250కోట్లు) వ్యయమవుతుంది. మొత్తంగా ఈ పనులకు రూ.4193 కోట్లు(ఇందులో పన్నులు రూ.943 కోట్లు) వ్యయం కానుందని అంచనా.
మేడిగడ్డ పునరుద్ధరణకు మూడు మార్గాలు!
కాళేశ్వరంలోని అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు 2023 అక్టోబరు 21న కుంగగా... రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. ఈ బ్లాకులో 6 పిల్లర్లను తొలగించాలా? లేక ఏడో బ్లాకు మొత్తం తొలగించాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి, 2019 నవంబరులో వరదల అనంతరం మేడిగడ్డ గేట్లు మూయగా... బ్యారేజీల దిగువ భాగంలోని సీసీ బ్లాకులు, రక్షణ వ్యవస్థలన్నీ చెల్లాచెదురు అయినట్లు గుర్తించారు. మరమ్మతుల కోసం డి జైన్లు అందించాలని మేడిగడ్డ నిర్మాణ సంస్థ కోరినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఉత్తర , ప్రత్యుత్తరాల రూపంలో తేలింది. ఆ తర్వాత నిర్వహణ లేకపోవడం, బ్యారేజీల్లో నిరంతరం నీటిని నిల్వ ఉంచడం వల్ల బ్యారేజీ దెబ్బతిన్నట్టు తేలింది. మేడిగడ్డ కుంగిన రోజున 10 టీఎంసీలకు పైగా నీటిని బ్యారేజీ నుంచి ఖాళీ చేశారు. ఇదే క్రమంలో అన్నారం, సుందిళ్లలో సీపేజీలు భారీగా బయటపడ్డాయి.
దాంతో ఆ బ్యారేజీల్లో నిల్వలు ఖాళీ చేయాలని, మరమ్మతులు చేసే దాకా బ్యారేజీ గేట్లను తెరిచే ఉంచాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫారసు చేసింది. అయితే ఇప్పుడు డిజైన్లు సిద్ధం కావడం, అంచనాలు కూడా రూపొందించడంతో సీడబ్ల్యూసీ అనుమతులు రాగానే బ్యారేజీల మరమ్మతులకు ఉపక్రమించాల్సి ఉంటుంది. కాగా, మేడిగడ్డకు మూడు ప్రత్యామ్నాయాలను డిజైన్ల సంస్థ సూచించింది. ఏడో బ్లాకులో ఆరు పిల్లర్లు తొలగించి ఇతర పిల్లర్ల లాగే కొత్తగా పిల్లర్లు కట్టి... స్టిల్లింగ్ బేసిన్‌ను విస్తరించడం అందులో ఒకటోది. ఆరు పిల్లర్లు తొలగించి స్పిల్‌వేతోపాటు పాండ్ లెవల్లో క్రెస్ట్ నిర్మాణం చేపట్టడం రెండోది. మూడోది ఏడో బ్లాకును పూర్తిగా తొలగించి ఇతర బ్లాకుల మాదిరిగానే కొత్త బ్లాకు నిర్మించడం, లేదా స్పిల్‌వే నిర్మించడం. ఇందులో ఏ మార్గాన్ని ఎంచుకుంటారనేది సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాతే తేలనుంది.
మూడు బ్యారేజీలకూ డయాఫ్రం వాల్లు
పునరుద్ధరణ పనుల్లో భాగంగా మూడు బ్యారేజీలకు ఎగువ, దిగువ భాగాల్లో డయాఫ్రం వాల్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. డయాఫ్రం వాల్లు కట్టకపోతే మూడు బ్యారేజీలు మనుగడ సాగించే పరిస్థితులు ఉండవని గుర్తించారు. ఇక, ప్రపంచంలో ఏ దేశంలో వినియోగించని విధంగా బ్యారేజీల నిర్మాణంలో సీకెంట్ పైల్స్ వినియోగించారు. వాటి అమరిక సరిగ్గా లేకపోవడంతో బ్యారేజీల్లో నీటి నిల్వతో ఒత్తిడి పెరిగి, ఆ ఒత్తిడి సీకెంట్ పైల్స్ లోపాలతో బ్యారేజీ దిగువ భాగంలోని ఇసుక మైనింగ్(ఇసుక వెళ్లిపోవడం)తో మేడిగడ్డ కుంగింది. అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో పంపింగ్ కోసం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలంటే డయాఫ్రంవాల్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని నిపుణులు గుర్తించారు. అంతేకాకుండా మూడు బ్యారేజీల్లో కూడా స్టిల్లింగ్ బేసిన్(గేట్ల నుంచి విడుదలయ్యే వరదలోని శక్తిని నిర్వీర్యం చేసే వ్యవస్థ)లను విస్తరించాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ డిజైన్లకు ఆమోదిస్తే ప్రభుత్వం పనులకు ఉపక్రమిస్తుంది.
2027 జూన్ తర్వాత పంపింగ్
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పూర్తయితే 2027 జూన్ తర్వాత కన్నెపల్లి(మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), సుందిళ్ల(కాసిపేట) పంపులు ప్రారంభించనున్నారు. 2027 జూన్ తర్వాత ప్రాణహితకు వరద రానుంది. దాంతో వరదల అనంతరం పంపింగ్‌ను ప్రారంభించనున్నారు. అది కూడా ఎల్లంపల్లి నీటి అవసరాల మీద ఆధారపడి ఉండనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News