Share News

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేందుకే గ్లోబల్‌ సమ్మిట్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:49 AM

పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను పరిచయం చేసేలా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేందుకే గ్లోబల్‌ సమ్మిట్‌

  • పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి చూపడమే లక్ష్యం

  • అధికారులతో సమీక్షలో మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, కందుకూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను పరిచయం చేసేలా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, ‘తెలంగాణ రైజింగ్‌-2047’ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోని యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ ఏర్పాట్లను మంగళవారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడింపజేసేందుకు ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించి... ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఇందుకు గ్లోబల్‌ సమ్మిట్‌ను ఒక కీలక వేదికగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకు అనుగుణంగా సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు.


భద్రత, పార్కింగ్‌, హాస్పిటాలిటీ, కనెక్టివిటీ, ట్రాన్స్‌పోర్ట్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, విద్యుత్తు సరఫరా, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, అత్యవసర వైద్య సేవలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆతిథ్యం ఉండాలన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సమగ్ర పారిశ్రామిక ఎకో సిస్టమ్‌, టాలెంట్‌ పూల్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ఎక్స్‌పో జోన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని చెప్పారు. ముఖ్యంగా... ఐటీ, ఫార్మా, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ తదితర కీలక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.


ప్రత్యేక ఆకర్షణగా ఎక్స్‌పోలు

యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయనున్న ఎక్స్‌పోల ఏర్పాట్లను మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. ఇన్వెస్ట్‌ తెలంగాణ శిఖరాగ్ర సదస్సులో ప్ర ధానంగా రక్షణ రంగానికి సంబంధించిన ఎక్స్‌పోలను ప్రదర్శించనున్నట్లు ఫ్యూచర్‌సిటీ అథారిటీ కమిషనర్‌ శశాంక వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణరంగ పరికరాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయడంతో మంత్రి అధికారులను అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 04:49 AM