Share News

ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ

ABN , Publish Date - Mar 16 , 2026 | 10:02 AM

సర్కారు భూముల ఆక్రమణలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్‌ రెవెన్యూ పరిధిలోని 354/1, 354/2, 354/3 సర్వే నంబర్లలోని 2.34 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు కాపాడారు.

ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ

  • అత్తాపూర్‌లో 2.34 ఎకరాల స్థలం స్వాధీనం

  • ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు

  • రూ.250 కోట్ల విలువ ఉంటుందని అంచనా

హైదరాబాద్: సర్కారు భూముల ఆక్రమణలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్‌ రెవెన్యూ పరిధిలోని 354/1, 354/2, 354/3 సర్వే నంబర్లలోని 2.34 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి హైడ్రా(HYDRA) అధికారులు కాపాడారు. ఈ భూమి విలువ సుమారు రూ.250కోట్లు ఉంటుందని హైడ్రా వర్గాలు పేర్కొంటున్నాయి. అత్తాపూర్‌ పరిధిలో చుట్టూ దేవాలయాలున్న ప్రాంతంలో మధ్యలో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి ఆనుకొని మరో వర్గానికి సంబంధించిన సమాధులు ఉన్నాయి. స్థలాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని ఓ వర్గం.. తమకే ఇవ్వాలని మరో వర్గం కొన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తోంది.


ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. భూమి విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. ఇదిలా ఉంటే ఓ వర్గం వారు 2.34 ఎకరాల భూమి చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మించారు. దీనిపై రాంబాగ్‌, పాండురంగానగర్‌, అత్తాపూర్‌, హైదర్‌గూడ పరిసర ప్రాంతాలకు చెందిన ఓ వర్గం ప్రజలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ భూమిని పరిశీలించారు. రెండు వర్గాలతో మాట్లాడడంతోపాటు రెవెన్యూ అధికారుల వద్ద వివరాలు సేకరించారు. అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.


city6.jpgదీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. రేకులను తొలగించారు. ఓ వర్గం సమాధులు ఉన్న 366 చదరపు గజాల స్థలం మినహా మిగతా స్థలం చుట్టూ హైడ్రా ఆధ్వర్యంలో ఫెన్సింగ్‌ వేసి.. ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దశాబ్దాల నుంచి భూవివాదం ఉండగా.. పరిష్కారం చూపడంపై రంగనాథ్‌కు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే ఆక్రమణల ప్రహరీ తొలగింపు క్రమంలో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గం వారు కొందరు కూల్చివేతలపై అభ్యంతరం తెలిపారు. ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. పక్కనున్న వారు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రోహిత్‌రెడ్డి జైలుకు

నేనే తప్పూ చేయలేదు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 16 , 2026 | 10:02 AM