రోహిత్‌రెడ్డి జైలుకు
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:36 AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కటకటాల్లోకి వెళ్లారు....
డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
పైలట్ సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మకు కూడా.. కాల్పులు జరిపిన కేసులో ఈ ముగ్గురికీ రిమాండ్?
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌కు పాజిటివ్.. రక్త పరీక్షల్లో నిర్ధారణ అయిందన్న పోలీసులు
మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని వెల్లడి.. ఎంపీ సహా ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో రోజంతా హైడ్రామా
మొయినాబాద్/చేవెళ్ల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కటకటాల్లోకి వెళ్లారు. రోహిత్‌రెడ్డితోపాటు డ్రగ్స్ పార్టీలో పాల్గొని నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మకు కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్ పార్టీలో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వీరిలో ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మహేశ్‌కుమార్‌తోపాటు మిగిలిన నిందితులందరికీ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై శనివారం రాత్రి ఈగల్ టీం, ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు కలిసి దాడులు నిర్వహించడం, ఈ సందర్భంగా కాల్పులు కూడా చోటుచేసుకోవడం తెలిసిందే. కాగా, ఫాంహౌ్‌సలో డ్రగ్స్ పార్టీ జరుపుకొంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున వారందరినీ ఫాంహౌస్ నుంచి తరలించిన పోలీసులు.. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు కాకుండా ఫ్యూచర్ సిటీ పరిధిలోని శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడే వారిని విచారించి.. ఆ తరువాత హైదరాబాద్‌కు తీసుకెళ్లి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిందితులు ఎక్కడున్నారన్న అంశంపై హైడ్రామా కొనసాగింది. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు గంట గంటకూ విచారణ నివేదికను సవరించారు.
ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్..
ఫాంహౌస్‌లో పార్టీలో పాల్గొన్నవారు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలియడంతో శనివారం రాత్రే అందరికీ యూరిన్ పరీక్షలు నిర్వహిచారు. ఇందులో రోహిత్‌రెడ్డితోపాటు మరికొందరికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం రక్త పరీక్షలు నిర్వహించగా.. రోహిత్‌రెడ్డి, ఎంపీ పుట్టా మహేశ్‌యాదవ్‌తోపాటు రోహిత్‌రెడ్డి సోదరుడు రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మ, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నెగిటివ్ వచ్చిన వారిలో ఎం.రమేశ్, శ్రవణ్‌కుమార్, విజయ్‌కృష్ణ, సిలివేరి శరత్‌కుమార్, ప్రియాంకరెడ్డి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా వ్యక్తుల మెటబాలిజం ఆధారంగా డ్రగ్స్ తీసుకున్నవారి శరీరంలో వాటి ఆనవాళ్లు యూరిన్‌లో ఆలస్యంగా బయట పడతాయని పోలీసులు చెబుతున్నారు. ఫ్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం రక్త పరీక్షల నమూనాల ఆధారంగానే కేసులు నమోదు చేయాల్సి ఉందని, ఆ మేరకే కేసులు నమోదు చేశామని అన్నారు. తాము ఫాంహౌస్‌కు వెళ్లిన సమయంలో నమిత్‌శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపాడని, అయితే తుపాకీ లైసెన్స్ రితేశ్‌రెడ్డి పేరిట ఉందని, కాల్పులు జరపాల్సిందిగా రోహిత్‌రెడ్డి చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలపైనే ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు చెబుతున్నారు. వీరు ముగ్గురిని ఆదివారం రాత్రి రాజేంద్రనగర్‌లోని ఉప్పరిపల్లి మెజిస్ట్రేట్ ఎందుట హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఎంపీ మహేశ్‌కుమార్‌తోపాటు మిగిలిన వారందరికీ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు.
డ్రగ్స్ సరఫరాపై ఆరా..
పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి డ్రగ్స్ సరఫరా జరిగిన అంశంపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. రోహిత్‌రెడ్డి పీఏ సిలివేరి శరత్‌కుమార్ ఇచ్చిన సమాచారంతోనే కౌశిక్ రవిని ప్రశ్నించారు. రెండు కొకైన్ ప్యాకెట్లను పార్టీకి వచ్చిన వారందరికీ పంచి మిగిలినది జేబులో పెట్టుకున్నానని శరత్‌కుమార్ పోలీస్‌లకు చెప్పాడు. కాగా, రోహిత్‌రెడ్డికి స్నేహితుడైన బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి.. సిమ్లా ట్రిప్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపాడు. అతడు సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు కూడా నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. పోలీసుల దాడి సమయంలో రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్ తన వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను ధ్వంసం చేసినట్లు తెలిసింది. ఇందులో ఒకటి రోహిత్‌రెడ్డి ఫోన్‌కాగా, మరొకటి శ్రవణ్‌ది. పరిస్థితి తీవ్రతను గమనించి సెల్‌ఫోన్లను నేలకేసి కొట్టి పగలగొట్టినట్లు సమాచారం. దీనిపై పోలీసులు శ్రవణ్‌ను విచారించారు.