ఏ బిడ్డా.. శివారే అడ్డా!
ABN , Publish Date - Mar 16 , 2026 | 09:33 AM
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, తదితర నియోజకవర్గాల్లో ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఫామ్‌హౌజ్‌లను నిర్మించుకున్నారు.
నగర శివారులో డ్రగ్స్ కలకలం
ఫామ్‌హౌసుల్లో బడా బాబుల పార్టీలు
తాజాగా మొయినాబాద్‌లో పట్టుబడిన ప్రముఖులు
గతంలోనూ పలువురిపై కేసులు నమోదు
శివారు ప్రాంతాల్లో ఈగల్, ఎస్‌వోటీ నిఘా
పక్కా సమాచారంతో దాడులు
ఏ బిడ్డా.. ఇది మా అడ్డా అంటున్నారు కొందరు బడా బాబులు. నగర శివారులను డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఫామ్‌హౌసుల్లో పార్టీలు చేసుకుంటూ మత్తులో తూగుతున్నారు. మత్తు వినియోగం చట్టరీత్యానేరమని తెలిసినా బేఖాతరు చేస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు కూడా ఈ పార్టీల్లో పాలుపంచు కుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో 11మందిపై కేసు నమోదు కాగా, ముగ్గరు రిమాండ్‌కు తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, తదితర నియోజకవర్గాల్లో ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఫామ్‌హౌజ్‌లను నిర్మించుకున్నారు. వారంతాపు సెలవుల్లో కుటుంబాలతో కలిసి సరదాగా గడిపేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రముఖులు నిర్మించుకున్న ఫామ్ హౌజ్‌ల్లో అనుమతులు లేకుండా మందు పార్టీలు చేసుకుంటున్నారు.
అంతేకాకుండా ఆ పార్టీల్లో నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందని పార్టీలకు నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌజులను ఎంచుకుంటున్నారు. అయితే ఈ మత్తు పార్టీల్లో బడా వ్యాపారులు, బాధ్యత గల ప్రజాప్రతినిధులు పాల్గొనడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్లాదంగా ఉండే శివారు ప్రాంతాన్ని మత్తుతో చిత్తు చేస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి మొయినాబాద్(Moinabad)లో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌజ్‌లో పార్టీ జరిగింది. ఇందులో జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నేతలతోపాటు వ్యాపారవేత్తలు, ఏలూరు ఎంపీ మహే్‌షకుమార్‌యాదవ్ పాల్గొన్నారు.
ఈ పార్టీ సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసులు దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు. పార్టీలో పాల్గొన్న కొందరు డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారణ కావడంతో వారిపై కేసు నమోదు చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. గతంలోనూ జన్వాడలోని ఓ ఫాంహౌజ్‌లో మాజీ మంత్రి కె.తారకరామారావు బావమరిది రాజ్ పాకాలతో పాటు పలువురు డ్రగ్స్ వాడినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు అప్పట్లో రాష్ట్రంలో సంచలనమైంది. తాజాగా మొయినాబాద్‌లో నమోదైన కేసు రెండు రాష్ర్టాల్లోని రాజకీయ, వ్యాపార వేత్తల్లో కలకలం రేపింది. శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ వినియోగిస్తూ పార్టీలు చేసుకుంటున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బర్త్‌డే పార్టీలు, ఇతర వ్యాపార సంబంధమైన చర్చల్లోనూ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసుల దాడుల్లో వెలుగులోకి వస్తున్నాయి. గతంలో జరిగిన ఎస్‌వోటీ పోలీసుల దాడుల్లో కొకైన్, ఎండీఎంఏ, గంజాయితో పాటు ఓసీబీ పేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పక్క రాష్ర్టాల నుంచి శివారు ప్రాంతాలకు డ్రగ్స్‌ను తీసుకొచ్చి రహస్యంగా పార్టీలు చేసుకుంటున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News