ఆ మూడు పార్టీల మధ్య చీకటి ఒప్పందం
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:51 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లి స్‌ల మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఆరోపించారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్‌లపై రాంచందర్‌రావు ధ్వజం
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లి స్‌ల మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఆరోపించారు. ఆ పార్టీల వైఖరిని నగర ప్రజలు గుర్తించారని పేర్కొంటూ, వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వాటికి గుణపాఠం చెప్పబోతున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని, దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని ఆరోపించారు. మూడు కార్పొరేషన్‌లలో బీజేపీని గెలిపిస్తేనే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన పలువురు గౌడసంఘం నాయకులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో యువత, మహిళలు పెద్దఎత్తున పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతంరావు, బండా కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సామేల్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ
తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ హైందవ సమాజానికి, దళితులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు బాషా డిమాండ్ చేశారు. బ్రాహ్మణులను, హిందూ సంప్రదాయాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సామేల్‌పై కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని కోరారు. సామేల్‌పై చర్యలు తీసుకుని కాంగ్రెస్ నాయకత్వం బాధ్యతాయుత వైఖరి ప్రదర్శించాలని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కు మార్ విజ్ణప్తి చేశారు. హిందూ సమాజానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి కప్పరప్రసాదరావు డిమాండ్ చేశారు.