Share News

నేలకూలుతున్న చరిత్ర

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:58 AM

వర్షాకాలం వచ్చిందంటే నగరంలో ముంపు భయంతో వణికేవాళ్లు కొందరైతే.! శిథిలావస్థలోని వారసత్వ కట్టడాలు కనుమరుగవుతాయేమోనని బాధపడేవాళ్లు మరికొందరు.

నేలకూలుతున్న చరిత్ర
Hyderabad heritage buildings

  • శిథిలావస్థలో మహబూబ్‌ మాన్షన్‌

  • ఇప్పటికే నగరంలో కూలిన ఎన్నో వారసత్వ కట్టడాలు

  • వర్షాలకుతోడు నిర్లక్ష్యానికి ఒక్కొక్కటి కనుమరుగు

  • పరిరక్షించాలంటున్న పర్యాటక ప్రేమికులు

హైదరాబాద్‌ సిటీ: వర్షాకాలం వచ్చిందంటే నగరంలో ముంపు భయంతో వణికేవాళ్లు కొందరైతే.! శిథిలావస్థలోని వారసత్వ కట్టడాలు కనుమరుగవుతాయేమోనని బాధపడేవాళ్లు మరికొందరు. వానాకాలంలో ప్రతియేటా ఒక్కొక్క చారిత్రక జ్ఞాపకం నేలమట్టమవుతున్నది. గడిచిన పదేళ్లలో అత్యంత అరుదైన ఐదు వారసత్వ కట్టడాలను నగరవాసులు కోల్పోయారు.


ప్రజాప్రయోజనంలోకి తీసుకురావాలని..

హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని వారసత్వ పరిరక్షణ కమిటీ గుర్తించిన 142 చారిత్రక కట్టడాల్లో ఇదీ ఒకటి. ఇన్‌ట్యాక్‌ సంస్థ ప్రతినిధులు 2013లో మహబూబ్‌ మాన్షన్‌ను తనిఖీ చేశారు. ఆ భవనాన్ని ప్రజాప్రయోజనంలోకి తీసుకువచ్చేందుకు, అక్కడ ఆహారశాలలు, పురావస్తు వస్తువుల ప్రదర్శనశాల, నగర సంస్కృతిని తెలిపే వస్తువుల విక్రయశాలలు ఏర్పాటు చేస్తే, అదొక పర్యాటక స్థలంగా విరాజిల్లుతుందని ఆర్కిటెక్టు విద్యార్థులు సూచించారు. అయినా, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. భవన సముదాయంలోని ఒక్కో నిర్మాణం కూలుతోంది. అలా నిరుడు మహబూబ్‌ మాన్షన్‌పై అంతస్తులోని ముందుభాగం నేలమట్టమైంది. ఇలాగే వదిలేస్తే, మరికొద్ది రోజుల్లోనే ఆ భవనం పూర్తిగా కనుమరుగవుతుందనడంలో సందేహం లేదు. మహబూబ్‌ మాన్షన్‌ను పునరుద్ధరించాలని చరిత్ర అధ్యయనకారులు కోరుతున్నారు.


city6.3.jpgఐదేళ్లలో తలెత్తిన నష్టం

2018, ఆగస్టు నెలలో వందేళ్ల గౌలీగూడ బస్టాండ్‌ నేలమట్టమైంది. తర్వాత 160ఏళ్ల సుల్తాన్‌బజార్‌ స్కూలు కూలింది. మరొక సందర్భంలో చార్‌సౌ సాల్‌ చరిత కలిగిన గోల్కొండ కోటలోని రెండు బురుజులు పడిపోయాయి. చారిత్రక భవనాలు మరెన్నో శిథిలావస్థకు చేరాయి. రేపోమాపో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వందల ఏళ్ల నాటి నిర్మాణాలను పరిరక్షించేందుకు అధునాతన టెక్నాలజీ ఇంగ్లండ్‌ తదితర దేశాల్లో అందుబాటులో ఉందంటారు కన్జర్వేటీవ్‌ ఆర్కిటెక్ట్‌ తురగా వసంత శోభ. ప్రకృతి విపత్తుల సమయంలో వారసత్వ కట్టడాలను పరిరక్షించడం ‘కన్జర్వేషన్‌ అండ్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌’ పాలసీలో భాగం. అందుకు ప్రత్యేకంగా డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌నూ రూపొందించారు. అయితే, ఆ సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో అందుబాటులో లేదని నిపుణుల చెబుతున్నారు.


city6,2.jpgవారసత్వ కట్టడాల పరిరక్షణ విధానాన్ని ప్రకటించాలి

ఇప్పటికే ఎన్నో విలువైన కట్టడాలను కోల్పోయాం. చారిత్రక కట్టడాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వర్షాకాలంలో చారిత్రక భవనాలు కూలుతున్నాయంటే...అందుకు కారణం వర్షాలు కాదు, మన నిర్లక్ష్యమే. మహబూబ్‌ మాన్షన్‌ కూలినా, సుల్తాన్‌బజార్‌ బజార్‌ స్కూలు నేలరాలినా మొదటి నుంచి ఆ చారిత్రక సంపదను పట్టించుకోక పోవడంతోనే కనుమరుగయ్యాయి. ఇకనైనా నగరంలోని వారసత్వ భవనాలను పరిరక్షించేందుకు ఒక విధానాన్ని ప్రకటించాలి.

  • సజ్జద్‌ షాహిద్‌, కార్యదర్శి, సెంటర్‌ ఫర్‌ దక్కన్‌ స్టడీస్‌


125 ఏళ్ల కట్టడం...

మహబూబ్‌ మాన్షన్‌ను నిర్మించింది రాజకుటుంబీకుడైన హసన్‌బిన్‌ అబ్దుల్లా నవాజ్‌ జంగ్‌. ఆ భవనంపై ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ మనసు పడటంతో ఆయనకు కానుకగా ఇచ్చారు అబ్దుల్లా. యూరోపియన్‌, మొఘల్‌ నిర్మాణ శైలిలో కట్టిన ఈ భవనంలోని ఒక భాగం కింగ్‌కోఠి ప్యాలె్‌సలోని ముబారక్‌ మాన్షన్‌ను పోలి ఉంటుంది. ఇదే భవనంలో సర్దార్‌ బేగంతో మహబూబ్‌ అలీఖాన్‌ కలిసుండేవారని చరిత్ర అధ్యయనకారులు చెబుతారు. ప్యాలెస్‌ కిటికీలకు బంగారు తీగలతో నేసిన పర్దాలుండేవని కొందరు అంటారు. 1902లో నిర్మితమైన ఈ కట్టడం కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి లోనవుతోంది. తాగుబోతుల అడ్డాగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈసారి రోబో గణేశా!

క్యాన్సర్‌ కేర్‌, ఆరోగ్యశ్రీ భేష్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 11:58 AM