భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..
ABN , Publish Date - Aug 21 , 2026 | 10:30 AM
ఈ ఏడాది ఏప్రిల్ 22న భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. దీనిని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ దాడి వీడియో ఇప్పుడు పెద్దఎత్తున చర్చనీయాంశమైంది.
న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరుదేశాల ఘర్షణతో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల పరిస్థితి దారుణంగా తయారైంది. అనేక నౌకలపై ఇరాన్, అమెరికా దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న నౌకపై దాడికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. దీనిని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(FSUI) ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
ఏప్రిల్ 22న 21 మంది భారతీయులతో సహా మొత్తం 22 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన సాయుధ పడవలు చుట్టుముట్టినట్లు ఎఫ్ఎస్‌యూఐ తెలిపింది. ఐఆర్జీసీ బలగాలు నౌకపై ఆర్పీజీ కాల్పులు జరిపినట్లు, దీంతో సిబ్బంది భయంతో నౌక లోపల దాక్కున్నట్లు వెల్లడించింది. ‘వీరు సముద్రపు దొంగలు కాదు. వీరు ఐఆర్జీసీకి చెందిన నావికా దళాలు’ అని ఎఫ్ఎస్‌యూఐ పేర్కొంది. వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న పౌర సిబ్బందిని కేవలం భద్రతా సూచనలు, మార్గదర్శకాలతో మాత్రమే రక్షించడం సాధ్యం కాదని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, ఏప్రిల్ 22న హోర్ముజ్ జలసంధిలో రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. మరో నౌకపైనా కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో ప్రభావితమైన మూడు నౌకల్లోని రెండింటిలో మొత్తం 22 మంది భారతీయ నావికులు ఉన్నట్లు భారత ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకల్లో ఒకటైన ఎపమినోండాస్‌లో ఓ భారతీయ నావికుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో నౌక యూఫోరియాలో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అయితే, ఈ నావికులంతా సురక్షితంగా ఉన్నారని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
హోర్ముజ్ జలసంధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలు వాణిజ్య నౌకల భద్రతపై మరోసారి ఆందోళనలను పెంచాయి. యుద్ధ పరిస్థితుల్లో ఆయుధ ఘర్షణలకు పౌర నౌకలు, వాటిలో పనిచేస్తున్న సిబ్బంది గురికాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
దేశాభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలే మూలస్తంభాలు
పాక్ కాదు.. చైనానే.. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు