Share News

పాక్ కాదు.. చైనానే.. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 10:13 AM

భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు.

పాక్ కాదు.. చైనానే.. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు
Ex army Chief General Naravane

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. పలు రంగాల్లో చైనా భారత్‌కు ప్రధాన పోటీగా మారుతోందని అన్నారు. తాను రచించిన నూతన పుస్తకం ‘ది క్యూరియస్ అంది క్లాసిఫైడ్: అన్‌ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ విడుదల సందర్భంగా జనరల్ నరవణే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019-22 మద్య నరవణే భారత ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

పాక్, చైనాలతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవని జనరల్ నవరణే అన్నారు. ‘రెండు దేశాలతోనూ మనం యుద్ధాలు చేశాము. వాళ్లతో ఎప్పటికీ ముప్పు ఉంటూనే ఉంటుంది. పాక్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయి. ఉగ్రవాదం ఎగదోస్తున్న పాక్‌పై దృష్టి పెట్టాల్సి వస్తోంది. కానీ నా అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలంలో చైనాతోనే భారత్‌‌కు ప్రధాన పోటీ ఉంటుంది. నేను చైనాను శత్రువుగా కాకుండా పోటీదారుగా పేర్కొనడానికి కారణం కూడా ఉంది. కేవలం యుద్ధరంగంలోనే కాకుండా రాజకీయాలు, ఆర్థికరంగం, వాణిజ్య రంగాల్లో కూడా చైనాతో పోటీ ఉంటోంది’


‘పోటీ ఉన్న చోట ఎంతో కొంత ఘర్షణ ఉంటూనే ఉంటుంది. అయితే, ఈ పొరపొచ్చాలను దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. మరో మార్గం లేనప్పుడే బలప్రయోగానికి దిగాలి. ఒక్కోసారి ఈ పరిస్థితి ఎదురు కావొచ్చు. అలాంటి సమయాల్లో ప్రత్యర్థి ఒకింత వెనకడుగు వేసేలా మిలిటరీ సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలి. భౌగోళిక రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా మన ఇరుగుపొరుగుగా ఎవరు ఉంటారనేది చెప్పలేము. కాబట్టి, అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి’ అని జనరల్ నరవణే అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

దేశాభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలే మూలస్తంభాలు

మహారాష్ట్ర విద్యా మంత్రి రాజీనామా చేయాలి: అభిజీత్‌ దీప్కే

Updated Date - Aug 21 , 2026 | 10:24 AM