శుద్ధినీటిపై ఆసక్తి.. క్యూరింగ్‌తో పాటు పలు అవసరాలకు..
ABN , Publish Date - Nov 18 , 2026 | 09:49 AM
మురుగును శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణ అవసరాలకు వినియోగించేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి.
ఉచితంగా అందిస్తున్న వాటర్‌బోర్డు
భారీ ప్రాజెక్టులకు పైపులైన్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు
భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నాలు
హైదరాబాద్ సిటీ: మురుగును శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణ అవసరాలకు వినియోగించేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నీటిని క్యూరింగ్‌తో పాటు ఇతర అవసరాలకు నిరభ్యంతరంగా వినియోగించవచ్చని నిపుణులు సూచిస్తుండడంతో ఆసక్తిని కనబరుస్తున్నాయి. శుద్ధి చేసిన నీటిని వాటర్‌బోర్డు అధికారులు వృథాగా వదిలేయకుండా భవన నిర్మాణాలకు, ఇతర అవసరాలకు ఉచితంగా అందిస్తున్నారు.
నీటి ఆదానే కాదు..
ఎల్‌నినో నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో వాటర్‌బోర్డు సరఫరా చేస్తున్న నీటిని ఆదా చేయడమే కాదు.. పెద్దఎత్తున తోడుతున్న భూగర్భ జలాలను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతీ ఇంట్లో 20శాతం నీటిని ఆదా చేయాలని అధికారులు ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో భవన నిర్మాణాలకు భూగర్భ జలాలను వాడొద్దంటూ ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణాలకు వినియోగించాలని క్రెడాయ్, నరెడ్కో లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా డెవలపర్లకు, నిర్మాణ సంస్థలకు అవగాహన కల్పిస్తున్నాయి. మురుగును శుద్ధి చేసిన నీటిని వినియోగించడానికి వాటర్‌బోర్డు ప్రత్యేకంగా గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రవేశపెట్టింది. శుద్ధి చేసిన నీటిని సైతం ఉచితంగా అందజేస్తుంది.
ముందుకొస్తున్న నిర్మాణ సంస్థలు
భవన నిర్మాణాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించడానికి పలు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. నగరంలో గ్రీన్ ట్యాంకర్లు ప్రారంభమైన రోజు నుంచే వజ్రా వెస్ట్ సిటీ అనే సంస్థ శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ప్రారంభించింది. కోకాపేట మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నుంచి రోజుకు 90 వేల నుంచి 120 కిలోలీటర్ల నీటిని పొందుతోంది. అదేవిధంగా ఎల్‌బీనగర్‌లోని వాసవీ నిర్మాణ సంస్థ సైతం కూడా శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తోంది. ఉప్పల్‌లోని వెర్మాంట్ అనే సంస్థ కూడా ముందుకొచ్చింది.
భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గేలా
నగరంలోని పలు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల ప్రాజెక్టులు రావడం.. నీటి కోసం పెద్దఎత్తున బోర్లు వేస్తున్నారు. వందల మీటర్ల లోతుకు వెళ్ళి మరీ నీటిని తోడుతున్నారు. భవన నిర్మాణల క్యూరింగ్ కోసం పెద్దఎత్తున నీటి అవసరమున్న నేపథ్యంలో వేగంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. బహుళ అంతస్తుల ప్రాజెక్టు వచ్చిన తర్వాత తమ బోర్లు ఎండిపోతున్నాయని పరిసర ప్రాంతాల వారు వాపోతున్నారు. కానీ బహుళ అంతస్తుల భవన నిర్మాణాల కోసం రోజంతా బోరు నీటిని తోడి సంపులను నింపుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ భవన నిర్మాణాలకు భూగర్భ జలాలను వాడకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంభించాలని ఉత్తర్వులిచ్చిన విషయం విధితమే.
పైపులైన్ వ్యవస్థకు చర్యలు
నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి పైపులైన్ ద్వారా మురుగును శుద్ధి చేసిన నీటిని తరలించడానికి వాటర్‌బోర్డు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ట్యాంకర్లపైనే ఆధారపడకుండా ఎస్టీపీ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నేరుగా శుద్ధి జలాలను సరఫరా చేస్తామని వాటర్‌బోర్డు ఎండీ ఇప్పటికే ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సుమారు 300 నుంచి 400 మీటర్ల మేర ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేసే సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్లు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News