వలస కార్మికుల పిల్లల కోసం ‘వర్క్‌సైట్’ స్కూళ్లు
ABN , Publish Date - Mar 20 , 2026 | 09:44 AM
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరానికి బిహార్, జార్ఖండ్, యూపీ, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్మికులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వస్తున్నారు.
ప్రాథమిక విద్యతోపాటు భద్రత కల్పించేందుకు చర్యలు
సైబరాబాద్ సీపీ రమేష్ సరికొత్త ఆలోచన
త్వరలో అమలుకు కసరత్తు
హైదరాబాద్ సిటీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరానికి బిహార్, జార్ఖండ్, యూపీ, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్మికులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వస్తున్నారు. హోటళ్లు, పరిశ్రమలు, దుకాణాలు, భవన నిర్మాణ రంగంలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గ్రేటర్ పరిధిలోన సుమారు 8-10 లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్లు అధికారులు అంచనా. ఏజెంట్లు, మధ్యవర్తులు, ఇతర నిర్వాహకులు వారికి పని ప్రదేశంలో తాత్కాలిక వసతి కల్పించి వదిలేస్తున్నారు.
దీంతో వారు అపరిశుభ్ర వాతావరణంలో బతుకు వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో వలస కార్మికుల పిల్లలకు పని ప్రదేశంలో భద్రత లేకుండా పోతుంది. తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్లినప్పుడు వారిని మిగిలిన పిల్లలతో కలిసి లేబర్ క్యాంపుల్లో వదిలేయడం లేదా మరీ చిన్న పిల్లలైతే తమతోపాటు పని ప్రదేశానికి తీసుకెళ్లి పనులు చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలో లేబర్ క్యాంపుల్లో ఒంటరిగా ఉండే పిల్లలకు రక్షణ ఉండడం లేదు. కొంతమంది ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులు, కామాంధులు ఆ చిన్నారులపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడటం, ఎత్తుకెళ్లడం చేస్తున్నారు.
రక్షణతోపాటు విద్య
లేబర్ క్యాంపుల్లో ఒంటరిగా ఉంటున్న వలస కార్మికుల పిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు.. ప్రాథమిక విద్యను అందించేందుకు సైబరాబాద్ సీపీ ఎం.రమేష్(Cyderabad CP M. Ramesh) కసరత్తు చేస్తున్నారు. పని ప్రదేశాల్లోనే వర్క్ సైట్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థల యాజమాన్యాలు, లేబర్ క్యాంపు నిర్వాహకులు, కన్‌స్ట్రక్షన్ సంస్థలు, ఎన్జీవోలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) తదితర సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని నిర్ణయించారు.
చిన్నారులకు అందించే విద్యను నర్సరీతో ప్రారంభించి ఏ తరగతి వరకు అందించాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీపీ రమేష్ వలస కార్మికుల గుర్తింపు కోసం చర్యలు తీసుకున్నారు. పని ప్రదేశాల్లో వారికి ఏదైనా ప్రాణ నష్టం సంభవిస్తే వెంటనే బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సీపీ నిర్ణయాల వల్ల లక్షలాది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండే అవకాశాలున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News