75 గజాల్లో 7 మీటర్ల ఎత్తు మించితే కూల్చేస్తాం
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:23 AM
సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు ముమ్మరమయ్యాయి. సీఎంసీ కమిషనర్ జి.సృజన ఆదేశాల మేర కు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సోమవారం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి 38 అనధికార నిర్మాణంలో ఉన్న భవనాలను గుర్తించాయి.
సీఎంసీ కమిషనర్ హెచ్చరిక
పలు ప్రాంతాల్లో ‘హైడ్రా’ రంగనాథ్ పర్యటన
‘అంజయ్యనగర్ భవనం’ నిందితుడు సయ్యద్ సాజిద్ అరెస్టు
సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెల్లడి
38 అనధికార నిర్మాణాల గుర్తింపు.. 9 భవనాల కూల్చివేత
28 భవనాలకు యూసీ నోటీసులు.. ఒక భవనం సీజ్
పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన
కొనసాగుతున్న మరో ఏడంతస్తుల భవనం కూల్చివేత
ఇప్పటికే వినియోగంలో ఉన్న భవనాలపైనా దృష్టి
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు ముమ్మరమయ్యాయి. సీఎంసీ కమిషనర్ జి.సృజన ఆదేశాల మేర కు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సోమవారం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి 38 అనధికార నిర్మాణంలో ఉన్న భవనాలను గుర్తించాయి. వీటిలో 28 భవనాలకు యూసీ నోటీసులు జారీ చేయగా, ఒక భవనాన్ని సీజ్ చేశా రు. మరో 9 అనధికార నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశామని అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా ఎత్తు పెంచుతున్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కాగా, 75 గజాల కంటే తక్కువ ఉన్న స్థలాల్లో 7 మీటర్లకు మించి ఎత్తుతో నిర్మిస్తున్న భవనాలను కూల్చివేస్తామని సీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. అలాగే 75 గజాల కంటే ఎక్కువ ఉన్న స్థలాల్లో అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలపైనా చర్యలు తీసుకుంటామన్నారు.
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన..
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సీఎంసీ జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. మొదట అంజయ్యనగర్‌లోని ప్రమాదకరంగా ఉన్న మరో ఏడంతస్తుల భవనం కూల్చివేత పనులను పరిశీలించారు. భవనం బలహీనంగా మారిన నేపథ్యంలో.. పక్కనున్న నివాసాలు, నిర్మాణాలపై ప్రభావం పడకుండా జాగ్రత్తగా కూల్చివేస్తున్నట్టు రంగనాథ్ తెలిపారు. బాహుబలి క్రేన్ ద్వారా శ్లాబ్‌లు, గోడలను పిండి(క్రష్) చేస్తున్నారు. దీంతో భవనంపై ఎక్కువ ఒత్తిడి పడదని, ఉన్నపళంగా కూలే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పారు. పక్కనున్న స్టెర్లింగ్ వైట్ ఫీల్డ్ అపార్ట్‌మెంట్, అంజయ్యనగర్ వైపు ఉన్న హాస్టల్‌లోని పిల్లలనూ ఖాళీ చేయించామన్నారు. సీఎంసీ అధికారులు కోరితే.. కూల్చివేతల్లో సహకరిస్తామన్నారు. కాగా, పర్యటన క్రమంలో ప్రమాదకర భవనాలు ఉన్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నిర్మాణంలో ఉన్న భవనాలే కాకుండా.. ఇప్పటికే వినియోగంలో ఉన్న భవనాల నిర్మాణ స్థిరత్వంపైనా దృష్టి సారించాలన్న యోచనలో యంత్రాంగం ఉంది. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశముందని ఓ అధికారి తెలిపారు.
ఈ వార్తలను కూడా చదవండి