ఊడ్చేస్తున్నారు!
ABN , Publish Date - Aug 25 , 2026 | 03:37 AM
స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతలు బరి తెగించారు. జడ్పీ, మండలపరిషత్‌ల్లో నిధుల అందుబాటు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, పనుల జాతరకు ఎడాపెడా తెర తీశారు.
స్థానిక ఎన్నికల వేళ వైసీపీ విచ్చలవిడి
నిధులు లేకున్నా ఎడాపెడా పనుల పందేరం
లభ్యత కంటే కొన్ని రెట్లు అధికంగా మంజూరు
బలం ఉన్న పరిషత్‌ల్లో ‘ఆర్థిక’ నిధులూ స్వాహా
‘పశ్చిమ’ జడ్పీలో ఏకంగా 568 పనులు
సాధారణ నిధుల మంజూరులోనూ ఇదే తీరు
అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతలు బరి తెగించారు. జడ్పీ, మండలపరిషత్‌ల్లో నిధుల అందుబాటు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, పనుల జాతరకు ఎడాపెడా తెర తీశారు. తమకు ‘బలం’ ఉన్న స్థానిక సంస్థల్లో యథేచ్ఛగా పనుల పందేరం మొదలుపెట్టారు. సెప్టెంబరు 23, 24 తేదీల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలకు పదవీకాలం ముగియనుంది. దీంతో, నిధుల లభ్యత కంటే కొన్ని రెట్లు ఎక్కువ పనులను వైసీపీ నేతలు మంజూరు చేస్తున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా తమ పదవీకాలం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా కొన్ని జిల్లా పరిషత్‌ల్లో నిధుల లభ్యతను మించి ఐదు రెట్ల మేర సాధారణ, ఆర్థిక సంఘం నిధుల కింద పనులు మంజూరుచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మరీ బరితెగించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వనరులు రూ.17.13 కోట్లు మాత్రమే ఉండగా, రూ.90.57 కోట్ల (568ు) పనులు మంజూరుచేశారు. ఆ పనులన్నీ చేపడితే, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఎంత లేదన్నా ఐదేళ్లు పడుతుంది. జడ్పీ చైర్మన్‌లు రాజకీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో జడ్పీ సీఈవోలు వారించలేని పరిస్థితి. ఇక్కడ సాధారణ నిధులు రూ.5.24 కోట్లు ఉండగా, ఏకంగా రూ.30.86 కోట్లకు పనులు మంజూరుచేశారు. పశ్చిమ గోదావరితో పాటు విజయనగరం, కర్నూలు జిల్లాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లాలో 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.11 కోట్లు ఉండగా, రూ.40.69 కోట్ల పనులు మంజూరుచేశారు. కర్నూలు జిల్లా పరిషత్‌లో ఈ నిధులు కేవలం రూ.17 కోట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఏకంగా రూ.90.57 కోట్ల పనులు మంజూరుచేశారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లోనూ నిధుల లభ్యతకు మించి పనులు మంజూరు చేశారు.
పంచాయతీల్లోనూ.. నీటి అవసరాలకు తప్ప మిగిలిన ఏ పనులూ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టరాదని కమిషనర్ నిబంధనలు విధించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా, కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి ఆ నిధులనూ ఇతర పనుల కోసం వైసీపీ నేతలు మళ్లించారు. కొందరు పంచాయతీ కార్యదర్శులను కమిషనరేట్‌కు పిలిచి దీనిపై ఉన్నతాధికారులు సమీక్ష సైతం నిర్వహించారు. కొందరిపై చర్యలు తీసుకున్నారు. బోగస్ బిల్లులు పెట్టి గ్రామ పంచాయతీ నిధులను స్వాహా చేసినవారి జాబితా ఇవ్వాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్‌శాఖను పలువురు ఎమ్మెల్యేలు కోరగా, ఆ శాఖ వివరాలు అందించింది. సుమారు 62 పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.14 కోట్లు, సాధారణ నిధులు రూ.17 కోట్లు దొంగ బిల్లులు పెట్టి స్వాహా చేశారని పేర్కొంది. కమిషనర్ ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా, పంచాయతీ నిధులు స్వాహా చేశారు. ఇదే వరుసలో ఇప్పుడు జడ్పీ, ఎంపీపీ నిధులను ఖాళీ చేసేందుకు వైసీపీ నేతలు తెగబడ్డారు.